అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి మోక్షం
eenadu telugu news
Published : 16/09/2021 01:19 IST

అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి మోక్షం

జిల్లాలో 81 ఖాళీలు
దరఖాస్తుల సమర్పణకు 23వరకు గడువు
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌
ధ్యానంలో చిన్నారులు

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు. జిల్లాలో మాత్రమే వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు వాటికి మోక్షం లభించింది. అంగన్‌వాడీ ఉపాధ్యాయినులు, సహాయకులు, మినీ అంగన్‌వాడీ ఉపాధ్యాయినుల భర్తీకి శ్రీకారం చుట్టారు. కేంద్రం పరిధిలో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్య రక్షణ చర్యలతో పాటు గర్భిణులకు, బాలింతల కోసం ఆరోగ్యలక్ష్మి పథకం అమలు తదితర విధులను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో అనేక చోట్ల ఖాళీలు ఉండటంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 81 పోస్టులను మంజూరు చేశారు. వీటిలో అంగన్‌వాడీ ఉపాధ్యాయినులు 17, సహాయకులు 60, మినీ అంగన్‌వాడీ ఉపాధ్యాయినులు 4 పోస్టుల భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 13 నుంచి 23 వరకు అవకాశం కల్పించారు. ప్రధాన కేంద్రాల టీచర్లు, సహాయకులు, మినీటీచర్లు వరుసగా మర్పల్లి 4, 12, 1, పరిగి 5, 9, 3, తాండూరు 6, 21, 0, వికారాబాద్‌ 2, 18, 0 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. జిల్లాలో కొడంగల్‌, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్‌లో ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 1,106 కేంద్రాలున్నాయి. వీటిలో ప్రధాన కేంద్రాలు 969, మినీ 137 ఉన్నాయి. వీటి ద్వారా అంగన్‌వాడీ ఉపాధ్యాయినులు గ్రామీణ ప్రాంత చిన్నారులకు, తల్లులకు, గర్భిణులకు తగిన విధంగా సహాయ సహాకారాలను అందజేస్తూ వారి పురోభివృద్ధికి కృషి చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 0 నుంచి 6 నెలల శిశువులు 6,568, 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలు 34,655 మంది ఉన్నారు. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసు వారు 22,245 ఉన్నారు. గర్భిణులు 14,910 మంది ఉన్నారు.

స్థానికులకే ప్రాధాన్యం: లలితకుమారి, జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి, వికారాబాద్‌

అంగన్‌వాడీల నియామకంలో స్థానికులకే ప్రాధాన్యమిస్తాం. దరఖాస్తులు చేసే మహిళలు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఖాళీల భర్తీతో సిబ్బంది సంఖ్య పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. అంగన్‌వాడీ ఉపాధ్యాయినులు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరి భాగస్వామ్యం తప్పని సరి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని