కూలీ పనులకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

కూలీ పనులకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు

బొంకూరులో విషాదం

మృతదేహాన్ని కాగ్నా నదిలో నుంచి తరలిస్తూ..

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: సకాలంలో వైద్యం అందక ఆరోతరగతి విద్యార్థిని హారిక మృతి చెందిన కుటుంబంలో మరో విషాదం నెలకొంది. బాలిక పెదనాన్న మృతిచెందారు. గ్రామస్థులు తెలిపిన ప్రకారం..తాండూరు మండలం బిజ్వార్‌ అనుబంధ గ్రామం బొంకూరుకు చెందిన పెంటప్ప(45) తనకున్న 2.05 ఎకరాల్లో కంది పంట సాగు చేస్తున్నారు. వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల వర్షాలతో కాగ్నా నది ప్రవాహంతో గ్రామానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం వాగు ప్రవాహం తగ్గింది. దీంతో బుధవారం కూలీ పనులకు వెళ్లేందుకు తాండూరు పట్టణానికి బయలుదేరి వెళ్లాడు. పనులు చేస్తుండగా ఛాతీలో నొప్పి వస్తోందని తోటి కూలీలకు తెలిపాడు. వెంటనే వారు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పెంటప్ప మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఆటోలో గ్రామానికి తరలించే వీల్లేకపోయింది. గ్రామస్థులు మృతదేహాన్ని మంచంపై ఉంచి వాగులోంచి ఇంటికి తరలించారు. పెంటప్పకు భార్య శివమ్మ ఉన్నారు. సర్పంచి నరేందర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని