బషీరాబాద్‌ ఎంపీడీవోపై జడ్పీ సీఈఓ విచారణ
eenadu telugu news
Published : 16/09/2021 01:29 IST

బషీరాబాద్‌ ఎంపీడీవోపై జడ్పీ సీఈఓ విచారణ


కార్యదర్శుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఈఓ జానకిరెడ్డి

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: బషీరాబాద్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి హరినందన్‌రావుపై జిల్లా పరిషత్‌ సీఈఓ జానకిరెడ్డి విచారణ చేపట్టారు. ఈనెల 14న ‘ఎంపీడీవో కనిపించడం లేదు’ అనే శీర్షికన ‘ఈనాడు’ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన జడ్పీ సీఈఓ మండల పరిషత్‌ కార్యాలయాన్ని సందర్శించారు. మండల పంచాయతీ అధికారి, సూపరింటెండెంట్‌, ఇతర సిబ్బంది, కార్యదర్శుల నుంచి వివరాలు సేకరించారు. కార్యాలయానికి ఎప్పటి నుంచి రావడం లేదని, గ్రామాలకు ఎప్పుడెప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారని పంచాయతీ కార్యదర్శులను అడిగారు. విధులకు సక్రమంగా రాలేదని తేలినట్లు సమాచారం. ఈమేరకు విచారణ నివేదికను జిల్లా పాలనాధికారిణికి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి పంపిస్తామని సీఈఓ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. విధులకు సక్రమంగా హాజరై ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని