అద్దం చెప్పిన నిజం
eenadu telugu news
Published : 16/09/2021 02:10 IST

అద్దం చెప్పిన నిజం

సైడ్‌ మిర్రర్‌ లేక 8 నెలల్లో 158 రోడ్డు ప్రమాదాలు

ఈనాడు, హైదరాబాద్‌

ద్విచక్ర వాహనం సైడ్‌ రేర్‌ వ్యూ మిర్రర్స్‌(సైడ్‌ అద్దాలు)ను తీసేయడం అంటే మృత్యువును ఆహ్వానించడమేనని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైడ్‌ అద్దాలు లేకుండా ద్విచక్రవాహనాలు నడపడంతో ఈ ఎనిమిది నెలల్లో 158 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లుగా తాజా అధ్యయనంలో గుర్తించారు. ఆయా ఘటనల్లో 169 మంది మరణించినట్లు లెక్క తేల్చారు.

ముప్పు ఎలా ముంచుకొస్తుందంటే...

వెనుకొచ్చే వాహనాలను చూడకుండానే ద్విచక్రవాహనదారులు ‘లేన్‌’ మారుతున్నారు. ఒక్కసారిగా యూ-టర్న్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరేమో వెనుకొచ్చే వాహనాలను చూసేందుకు తల వెనక్కి తిప్పుతున్నారు. మరికొందరేమో వెనుకొచ్చే వాటిని గమనించకుండానే ముందుకెళ్తున్నారు. అటువంటప్పుడు వాహనం అదుపు తప్పి డివైడర్‌ లేదా రోడ్డు పక్కనుండే రాళ్లు, చెట్లను ఢీకొడుతున్నారు. వెనుకొచ్చే వాహనం ఢీకొట్టి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు. అద్దాలుంటే.. ప్రమాదం తప్పించుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైడ్‌ అద్దాలు లేని ద్విచక్రవాహనాలను కమిషనరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి సీసీకెమెరాల సాయంతో చలానా వేస్తున్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 3.16 లక్షల చలాన్లు విధించినట్లు పోలీసులు చెబుతున్నారు.

తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే

సైడ్‌ అద్దాలు నిర్ణీత పద్ధతిలో అమర్చుకోవాల్సిందే. లేదంటే జరిమానా విధిస్తాం. ఈ విషయమై తరచూ అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. పోలీసులు కఠినంగా వ్యవహరించేది మీ కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

-విజయ్‌కుమార్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని