బస్సెక్కి వెళ్లి.. ఎంజీబీఎస్‌లో తిరిగి!
eenadu telugu news
Updated : 16/09/2021 06:02 IST

బస్సెక్కి వెళ్లి.. ఎంజీబీఎస్‌లో తిరిగి!

ఈనాడు - హైదరాబాద్‌

హానగరంలో టీఎస్‌ఆర్టీసీ ఎం.డి. వీసీ సజ్జనార్‌ ఆకస్మిక పర్యటనల జోరు పెంచారు. బుధవారం ఉదయం లక్డీకాపూల్‌ బస్టాపులో సామాన్య ప్రయాణికుడిలా నిలబడి.. గండిమైసమ్మ నుంచి సీబీఎస్‌ మీదుగా అఫ్జల్‌గంజ్‌ వెళ్లే బస్సు ఎక్కారు. ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌ గమనించలేదు. ప్రయాణికులతో కలిసిపోయి.. సిటీ బస్సుల సేవలపై ఆరా తీశారు.

ఎంజీబీఎస్‌లో 3 గంటలు: సీబీఎస్‌లో దిగి ఎంజీబీఎస్‌ వరకూ నడుచుకుంటూ వెళ్లారు. మూడు గంటలపాటు బస్‌స్టేషన్‌ అంతా కలియ తిరిగారు. మరుగుదొడ్లను పరిశీలించి.. దుర్వాసన రాకుండా చూడాలన్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మునిశేఖర్‌, రంగారెడ్డి రీజినల్‌ మేనేజ్‌ర్‌తో పాటు.. ఎంజీబీఎస్‌లోని ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. దుకాణాలు ఖాళీగా ఉండడాన్ని ప్రస్తావించారు. వెంటనే దుకాణాలన్నీ నిండేలా.. అద్దెలు వచ్చేలా చూడాలన్నారు. సీబీఎస్‌లో దిగి.. మూసీ నది వంతెన పైనుంచి ఎంజీబీఎస్‌కు సామాన్లతో ప్రయాణికులు రావడానికి అవస్థలు పడుతున్నారు. సీబీఎస్‌, ఎంజీబీఎస్‌ మధ్య ఎలక్ట్రిక్‌ వాహనాలు నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఇకపై అశ్లీల చిత్రాలకు నో!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ బస్సులపై అశ్లీల చిత్రాలు కనిపించకుండా చర్యలు చేపడతామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. హైదరాబాద్‌ నగర బస్సులపై ఓ సినిమాకు సంబంధించిన అశ్లీల పోస్టర్‌ చిత్రాలను బుధవారం ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ఆదాయం కోసం ఇలాంటి ప్రకటనలు బస్సులపై వేస్తున్నారంటూ పేర్కొన్న ఆయనకు పలువురు నెటిజన్లు మద్దతు తెలపడంతో ఆ ట్వీట్‌కు ఎండీ సజ్జనార్‌ స్పందించారు. దీనిపై సంస్థ చర్యలు తీసుకుంటుందని.. భవిష్యత్తులో ఇకపై అలాంటివి కనిపించకుండా చూస్తామంటూ రీట్వీట్‌ చేశారు. సజ్జనార్‌ వెంటనే స్పందించడంపై నెటిజన్లు ఆయన్ను ప్రశంసిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని