మహిళ దారుణ హత్య
eenadu telugu news
Published : 16/09/2021 03:41 IST

మహిళ దారుణ హత్య

ఆమనగల్లు, న్యూస్‌టుడే: హంతకుడు కత్తితో గొంతు కోసి, కుడి కాలు నరికి ఓ వివాహితను దారుణంగా చంపేశాడు. ఆమె కడియాలు, చెవి కమ్మలు దొంగిలించి ఉడాయించాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఆమనగల్లు మండల పరిధిలోని మాలేపల్లి శివారులో చోటుచేసుకుంది. బుధవారం సీఐ ఉపేందర్‌ కథనం మేరకు.. మాడ్గుల మండలం చంద్రాన్‌పల్లికి చెందిన కొమ్ము పోచమ్మకు ఆమనగల్లు పురపాలక సంఘం ముర్తూజపల్లికి చెందిన గాలయ్యతో 20 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహం చేశారు. పోచమ్మ హైదరాబాద్‌లోని గోషామహల్‌ పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికురాలు. భర్త గాలయ్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి నాలుగేళ్ల నుంచి తన తల్లి స్వగ్రామం చంద్రాన్‌పల్లిలో ఉంటోంది. రోజూ ఆక్కడి నుంచి గోషామహాల్‌కు ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం చంద్రాన్‌పల్లికి చేరుకుంటుంది. ఇదే క్రమంలో మంగళవారం ఉదయం వెళ్లిన పోచమ్మ రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో భర్త గాలయ్య ఫోన్‌ చేశాడు. ఆటోలో వస్తున్నానని, ఆమనగల్లు పరిధిలోని జంగారెడ్డిపల్లి సమీపంలో ఉన్నానని చెప్పింది. కొద్ది సేపటికి మళ్లీ ఫోన్‌ చేయగా సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది. గాలయ్య రాత్రి నుంచి ఉదయం వరకు సమీప బంధువులకు ఫోన్‌ చేశాడు. అయినా ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం మాలేపల్లి సమీపంలోని ఇర్విన్‌ రహదారి పక్కన బండరాయి వద్ద ఓ మహిళ హత్యకు గురైందన్న సమాచారం సమీప గ్రామాలకు పాకడంతో గాలయ్య అక్కడి చేరుకుని మృతదేహాన్ని చూసి పోచమ్మదేనని గుర్తించి భోరున విలపించాడు. అప్పటికే మాలేపల్లి సర్పంచి శ్రీనివాస్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమనగల్లు సీఐ ఉపేందర్‌, ఎస్సై ధర్మేశ్‌, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం స్వగ్రామం ముర్తూజపల్లికి తీసుకెళ్లే క్రమంలో జంగారెడ్డిపల్లి రహదారిపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ధర్నా చేపట్టారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని