అధ్యాపకుల కొరత.. బోధనకు వెత
eenadu telugu news
Published : 17/09/2021 00:34 IST

అధ్యాపకుల కొరత.. బోధనకు వెత

ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మేలు

న్యూస్‌టుడే,వికారాబాద్‌టౌన్‌: విద్యార్థుల చదువులపై కరోనా ప్రభావం చూపింది. ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులు విన్నా, ఆశించిన ఫలితం ఉండటం లేదు. ప్రస్తుతం విద్యాలయాలు తెరిచినా సరిపోను బోధకులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరతతో వెతలు తప్పడంలేదు. అతిథి అధ్యాపకులను ఇప్పటి వరకు విధుల్లోకి తీసుకోలేదు. ఉన్న సిబ్బందినే కొనసాగించడంతో పూర్తిస్థాయిలో పాఠాలు చెప్పలేకపోతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధకులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 6,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల హాజరు క్రమంగా పెరుగుతోంది. అధ్యాపకుల పోస్టుల ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ కాకపోవడంతో తరగతులు సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో 56 ఖాళీలు: కళాశాలల ప్రారంభించేందుకు ఉత్సాహం చూపిన ఇంటర్‌ బోర్డు, అతిథి అధ్యాపకుల నియామకాలపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో అధ్యాపకుల పోస్టులు 139 మంది ఉండగా ఇందులో శాశ్వత 2, ఒప్పంద 81, గెస్టులెక్చరర్స్‌ 56 మందితో కొనసాగించారు. ప్రస్తుతం అతిథి అధ్యాపకులు లేరు. వీరి విషయంలో ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోంది. అతిథి అధ్యాపకులుగా గతంలో పని చేసిన వారికి ఉపాధి లేదు. తమ సేవలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
ఒప్పంద విధానంలోనే ఎక్కువ: ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఎక్కువ మంది శాశ్వత ఉద్యోగులు ఉంటారు. కొన్ని పోస్టుల్లో మాత్రమే ఒప్పంద ఉద్యోగులు ఉండటం సాధారణమే. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. జిల్లాలో రెగ్యులర్‌ అధ్యాపకులు ఇద్దరు మాత్రమే ఉండగా ఒప్పంద అధ్యాపకుల సంఖ్య 81 మంది ఉండటం గమనార్హం.
పరిస్థితిని వివరించాం
శంకర్‌నాయక్‌ , జిల్లా ఇంటర్‌ నోడల్‌ విద్యాధికారి

త్వరలోనే అతిథి అధ్యాపకులను తీసుకునేందుకు ఇంటర్‌ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కళాశాలల్లో పాఠాల బోధనకు ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమే. ఉన్నతాధికారులకు వివరించాం. ఇంటర్‌ బోర్డు నుంచి ఆదేశాలు రాగానే నియామకాల ప్రక్రియకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కళాశాలలో ఉన్న అధ్యాపకులతో తరగతులు కొనసాగిస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని