ఒకే రోజు 6,771 మందికి టీకా
eenadu telugu news
Published : 17/09/2021 00:34 IST

ఒకే రోజు 6,771 మందికి టీకా

కొత్తగడి కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిఖిల

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో గురువారం జిల్లాలో 6,771 మందికి కరోనా టీకా వేశామని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి తుకారాంభట్‌ తెలిపారు. 5,980 మందికి తొలి డోస్‌, 791 మంది రెండో డోస్‌ వేశామన్నారు. జిల్లాలో మొత్తం 22 ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమం కొనసాగుతోంది. వికారాబాద్‌ మండలం రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యధికంగా 756 మందికి, మర్పల్లి మండలం పట్లూరు 718 మందికి టీకా ఇవ్వగా, అంగడిరాయిచూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 63 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. మిగతా 19 ఆసుపత్రుల్లో వంద నుంచి 600 మంది వరకు టీకాలు వేయించుకున్నారు.
ఇంటింటికీ వెళ్లి అవగాహన: కలెక్టర్‌
వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారు కొవిడ్‌ టీకా వేయించుకోవాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల సూచించారు. గురువారం వికారాబాద్‌ కొత్తగడి వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని, తమ బంధువులకు, చుట్టుపక్కల వారికి తెలిపి వారూ కేంద్రాలకు వచ్చేలా చూడాలని కోరారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కాలనీల్లో ఇంటింటికీ తిరిగి టీకా గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు.  కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ జీవరాజ్‌, డాక్టర్‌ అరవింద్‌ పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం: నవాబ్‌పేట మండలం పులుమామిడిలో పారిశుద్ధ్య కార్మికుడు పెంటయ్య మృతిచెందాడు. ఆయన కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. ఆయన భార్య ప్రమీల తమను ఆదుకోవాలని కోరుతూ జిల్లా పాలనాధికారిణికి అర్జీ సమర్పించారు. ఆమె వివరాలను పరిశీలించి రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందించాలని బ్యాంక్‌ మేనేజర్‌ స్వాతిని ఆదేశించారు. గురువారం లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాంబాబు, కలెక్టర్‌ చేతుల మీదుగా చెక్కును ప్రమీలకు అందజేశారు.
అనంతుడిని దర్శించుకున్న పాలనాధికారిణి
వికారాబాద్‌ గ్రామీణ: అనంతగిరి అనంతపద్మనాభ స్వామిని కలెక్టర్‌ నిఖిల గురువారం దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని