ఆక్రమణలపై..అధికారుల కన్నెర్ర
eenadu telugu news
Published : 17/09/2021 00:34 IST

ఆక్రమణలపై..అధికారుల కన్నెర్ర

 ఫిర్యాదులపై తక్షణ స్పందన

లాల్‌సింగ్‌ తండాలో అనుమతులు లేవని కూల్చివేత

* వికారాబాద్‌ మండలం గోధుమగూడ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు వాటిని కూల్చివేశారు. అసైన్‌మెంట్‌ భూములను వ్యవసాయానికే వినియోగించాలని, వాణిజ్య భూమిగా మార్చేందుకు వీలులేదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఒత్తిళ్లకు లొంగకుండా అధికారులు తమపని పూర్తి చేశారు.
* వికారాబాద్‌ మండలం లాల్‌సింగ్‌ తండాకు ఆనుకుని ఓ ప్రైవేటు వెంచర్‌లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో నోటీసులు ఇచ్చిన పంచాయతీ సిబ్బంది, అనంతరం వాటిని కూల్చివేశారు.
* వికారాబాద్‌ ఫురపాలక సంఘం కొత్రేపల్లి రెవెన్యూ పరిధిలో దశాబ్దాలుగా ఓ ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఉన్న రూ.150 కోట్ల విలువైన 160 ఎకరాల భూములను అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డు ఏర్పాటు చేశారు.  
* పూడూరు మండల పరిధిలో ఓ ప్రైవేటు వెంచర్‌ కోసం ప్రభుత్వ భూముల్లోంచి రహదారి నిర్మించినట్లు గుర్తించిన అధికారులు దానిని తొలగించారు. ఇలా మిగతా మండలాల్లోనూ దేవాలయ, అటవీ, అన్యాక్రాంతమైన సర్కారు భూములను స్వాధీనం చేసుకున్నారు.

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అసైన్‌మెంట్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలు, ప్రైవేటు భూమే అయినా నిబంధనలకు విరుద్ధంగా ఏ రకమైన కార్యకలాపాలు చేపట్టినా జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలకు రంగంలోకి దిగుతోంది. కింది స్థాయి సిబ్బందిపై ఆరోపణలు వస్తున్నా, ఉన్నతాధికారులు మాత్రం కచ్చితమైన సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నారు. ఆక్రమాల వెనుక ఎంత పెద్ద నేతలు ఉన్నా, చట్టప్రకారం తమపని తాము చేసుకపోవడంతో అక్రమార్కుల్లో గుబులు రేగుతోంది. జిల్లా భాగ్యనగరానికి ఆనుకుని ఉండటం, పర్యాటకంగా అభివృద్ధి చెండంతో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. అనంతగిరి అటవీ ప్రాంతం చుట్టూ రిస్సార్ట్స్‌ నిర్మాణాలు చేపడుతుండగా, పూడూరు, నవాబుపేట, మోమిన్‌పేట, వికారాబాద్‌, ధారూర్‌ మండలాల్లో నగర వాసులకు వందల సంఖ్యలో వ్యవసాయ క్షేత్రాలు, విడిది ఇళ్లు ఉన్నాయి. కొంత మంది సొంత వ్యాపార, వాణిజ్య, ఇతర అవసరాలకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, ఎవరైనా అధికారులు ప్రశ్నిస్తే ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారుతోంది.

కొత్రేపల్లిలో ప్రభుత్వ భూములు అనుమతులు లేవని కూల్చివేత

పేదలకు పంచిన వాటిని
పేద ప్రజలకు పంటలు సాగు చేసుకుని జీవించమని గతంలో ప్రభుత్వం 2 నుంచి గరిష్ఠంగా 5 ఎకరాల వరకు భూములను పంచిపెట్టింది. వాటిని అమ్ముకోవడం, వ్యవసాయేతర భూములుగా మార్చడానికి వీలు లేదని షరతులు విధించింది. అయితే కొందరు ఇటువంటి భూములపైనా దృష్టిసారిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు సాధ్యపడక 90 ఏళ్లు లీజుకు తీసుకుంటున్నట్లు ఒప్పంద పత్రం రాసుకుంటున్నారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వాటిపై రెవెన్యూ అధికారులు నిత్యం నిఘా పెడుతున్నారు. పరిపాలనా పరంగా అన్ని రకాలుగా అనుమతులు తీసుకుని, సరైన సమయంలో పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నారు. తదుపరి విచారణలో కొంత జాప్యం జరుగుతోందని సమాచారం. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసు, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయలోపం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ ఇద్దరు అధికారులే కీలకం
జిల్లా పరిపాలనా విభాగంలో ఇద్దరు అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజావాణిలో, ఇతర సమయాల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. వీటిపై పూర్తి ఆధారాలు సేకరించి, ఎవరికీ తెలియకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది సుమారు రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు అంచనా. ఇందులో పోలీసు శాఖ నుంచి పూర్తి స్థాయి సహాయ, సహకారాలు అందుతున్నాయి. అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తుండంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌

ప్రభుత్వ భూములు ఆక్రమణలకు పాల్పడినా, ప్రైవేటు భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు, ఇతర కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఆక్రమణలు గుర్తించినా మాకు సమాచారం అందిస్తే విచారించి స్వాధీనం చేసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని