సాగనంపేందుకు సాగరం సిద్ధం
eenadu telugu news
Updated : 18/09/2021 12:55 IST

సాగనంపేందుకు సాగరం సిద్ధం

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తలసాని చిత్రంలో మేయర్‌ విజయలక్ష్మి,

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌; కవాడిగూడ, న్యూస్‌టుడే: మహాగణపతి నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేద్దామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏర్పాట్లపై మేయర్‌, నగర యంత్రాంగంతో కలిసి ఆయన శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శోభాయాత్రకు తరలిరావాలని, శాంతిభద్రతలకు భంగం కలుగకుండా చూడాలన్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నగరంలో ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు, న్యాయస్థానం ఆదేశాలను పాటించాలని కోరారు. ట్యాంక్‌బండ్‌తోపాటు శివారులోని 14 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. కోనేరుల వద్ద కొనసాగుతున్నాయన్నారు. భక్తుల కోసం 5 లక్షల మాస్కులను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. నగర మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ నిమజ్జన కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర వసతులు కల్పించామన్నారు. 10 వేల మంది సిబ్బంది వేడుకల్లో 24 గంటలపాటు మూడు విడతల్లో పనిచేయనున్నట్లు తెలిపారు. ట్యాంక్‌బండ్‌ వద్ద 33 క్రేన్లు, ఎన్టీఆర్‌మార్గ్‌లో 11 క్రేన్లు, ఇతరత్రా వాహనాలతో విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌ మాట్లాడుతూ నగరవ్యాప్తంగా 320 కి.మీ. మేర శోభాయాత్ర ఉంటుందన్నారు.శాంతిభద్రతలను కాపాడేందుకు 19 వేల పోలీసులు బందోబస్తు చేస్తారని పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లు షురూ

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఖైరతాబాద్‌ ‘శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి’ నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. బడా గణేష్‌ను తరలించడానికి ఎస్‌టీసీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన భారీ ట్రాలీ వచ్చింది. దానిపై ఇనుప కమ్మల వెల్డింగ్‌ పనులు శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా శనివారం ఉదయం నుంచి బడా గణేష్‌ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు తొలగింపు కార్యక్రమాలు మొదలవుతాయి. దీంతో భక్తులు దూరం నుంచే మహాగణపతిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆదివారం ఉదయమే బడా గణేష్‌ భక్తులకు వీడ్కోలు పలికి నిమజ్జనానికి బయలుదేరి వెళతాడు.

100 కిలోల సురుచి మహాలడ్డూ

ఖైరతాబాద్‌ వినాయకుడికి సురుచి సంస్థ ఈ ఏడాది ‘100 కిలోల’ మహాలడ్డూను నైవేద్యంగా సమర్పించింది. తాపేశ్వరానికి చెందిన ‘సురుచి’ అధినేత మల్లిబాబు శుక్రవారం మహాలడ్డూను గణపతికి సమర్పించారు. గురువారం తాపేశ్వరం నుంచి మహాలడ్డూతో బయలుదేరిన మల్లిబాబు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకొని మహాలడ్డూను అందించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఆదివారం లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

ట్యాంక్‌బండ్‌పై విద్యుత్తు కంట్రోల్‌ రూమ్‌

ఈనాడు, హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జన సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ట్యాంక్‌బండ్‌ వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఛైర్మన్‌, ఎండీ రఘుమారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో కలిసి కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించారు. ఆదివారం నగరంలో ప్రతిమలను నిమజ్జనం కోసం శోభాయాత్రగా ఇక్కడికి తెస్తారని, ఈ నేపథ్యంలో విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పరిసర ప్రాంతాల్లో సమస్యలొస్తే కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 79015 30966, 79015 30866 లకు ఫోన్‌ చేయొచ్చన్నారు.


శోభాయమానం

నగరంలో ఈనెల 19న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్‌నిమజ్జన శోభాయాత్రకు హుస్సేన్‌సాగర్‌ సిద్ధమైంది. పరిసరాలు విద్యుద్దీపాల వెలుగులో దగదగలాడుతున్నాయి.


565 ప్రత్యేక బస్సులు

అదనంగా 8 ఎంఎంటీఎస్‌లు

ఈనాడు, హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టీఎస్‌ఆర్టీసీ 565 బస్సులను ప్రత్యేకంగా నడుపుతుండగా.. దక్షిణమధ్య రైల్వే 8 ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈనెల 19న నగరంలోని 29 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. హుస్సేన్‌ సాగర్‌ సమీపానికి ఈ బస్సులను నడుపుతున్నారు. బషీర్‌బాగ్‌, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌, లిబర్టీ, ఇందిరాపార్కు, లక్డికాపూల్‌, ఖైరతాబాద్‌కు చేరుకునేలా గణేష్‌ నిమజ్జనం స్పెషల్‌ పేరుతో బస్సులను నడపనున్నారు. ఎనిమిది చోట్ల కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి.. డిపో మేనేజర్లతో పాటు.. డీవీఎంలను పర్యవేక్షకులుగా నియమించారు. ఇబ్బందులు ఎదురైతే రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌ 9959226154, కోఠి బస్‌స్టేషన్‌ 9959226160 నంబర్లలో సిబ్బందిని సంప్రదించవచ్చని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

● శని, ఆదివారాల్లో అదనంగా 8 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

19వ తేదీన నడిచే అదనపు రైళ్లు

* రాత్రి 11.30కు సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు ఒక రైలు. ● హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి రాత్రి 11కు ఒక రైలు.

20న తిరిగేవి

* అర్థరాత్రి 12.30కు హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి. ● రాత్రి 1.50కి లింగంపల్లి-హైదరాబాద్‌. ● అర్థరాత్రి దాటాక రాత్రి 3.30కు హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ ● అర్థరాత్రి 12.10 గంటలకు లింగంపల్లి- ఫలక్‌నుమా. ● రాత్రి 2.20కి ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ ● వేకువ జామున 4 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్‌ రైలు ఉంటుంది.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని