అజేయ శక్తిగా తెరాస
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

అజేయ శక్తిగా తెరాస

పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌


నగర తెరాస కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో మంత్రులు తలసాని,

మహమూద్‌అలీ, పార్లమెంటరీ పార్టీ నేత కేకే తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రమంతటా తెరాస అజేయ శక్తిగా ఎదిగేందుకు కార్యకర్త స్థాయి నుంచి నేతల వరకు అందరూ శ్రమించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు సూచించారు. రాజధాని నగరం పార్టీకి అత్యంత కీలకమని, ఇక్కడున్న 6,400 బస్తీలు, కాలనీలు, 150 డివిజన్లలో ఈ నెల 20 నుంచి నెలాఖరులోగా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన తెరాస హైదరాబాద్‌ మహా నగర పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, నగర మేయర్‌ విజయలక్ష్మి, పార్టీ ప్రధాన కార్యదర్శులు బండి రమేశ్‌, సోమా భరత్‌, శ్రీనివాస్‌రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌ నాయకత్వమే పార్టీకి శ్రీరామరక్ష. ప్రతీ ఎన్నికల్లో ప్రజలు ఆయన పాలన కోరుతూ ఓట్లు వేస్తున్నారు. ఆయన పేరిటే గెలుస్తామని అభ్యర్థులు నమ్ముతున్నారు. సీఎం పేరు ఎంత ముఖ్యమో పార్టీ బలోపేతం అంత ముఖ్యమే. పార్టీని నిర్లక్ష్యం చేసే ధోరణి సరికాదు’’ అని తెలిపారు. సంస్థాగత ఎన్నికల నిర్మాణం హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా జరిగినా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు కమిటీలే ఉంటాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలో జిల్లా కమిటీలు ఏర్పాటవుతాయన్నారు. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీల మార్పిడిపై మంత్రులు తలసాని, మహమూద్‌ అలీలకు సూచనలిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని