మార్కెట్‌ షెడ్డుపై శిశువు.. ఆసుపత్రికి తరలింపు
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

మార్కెట్‌ షెడ్డుపై శిశువు.. ఆసుపత్రికి తరలింపు

చార్మినార్‌, న్యూస్‌టుడే: పుట్టిన కొద్దిగంటల వ్యవధిలోనే ఆడ శిశువును మార్కెట్‌లోని షెడ్డుపై వదిలి వెళ్లిందో తల్లి. ఈ ఘటన పాతబస్తీ రెయిన్‌బజార్‌ ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బ్రహ్మణవాడి మార్కెట్‌లోని ఓ దుకాణం వద్ద ఉదయం 10 గంటల ప్రాంతంలో శిశువు ఏడుపు వినిపించింది. దుకాణాదారు అంగోత్‌కుమార్‌ గమనించి చుట్టుపక్కల వెతకగా.. షెడ్డుపై చిన్నారి కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న రెయిన్‌బజార్‌ సీఐ ఆంజనేయులు, ఎస్సై ఎం.ప్రసాద్‌ శిశువును నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయని ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. చిన్నారి సంరక్షణ కోసం చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారం అందించారు. శిశువును గుర్తు తెలియని మహిళ తెల్లవారుజామున మార్కెట్‌ షెడ్డుపై వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్‌

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: వినాయక నిమజ్జనం సందర్భంగా రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఆది, సోమ రెండు రోజులు మద్యం అమ్మకాలు ఉండవని కమిషనర్లు మహేశ్‌ భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర, అంజనీకుమార్‌లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్‌ ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని