బాలాపూర్‌ గణనాథుడికి తొలగిన అడ్డంకి
eenadu telugu news
Published : 19/09/2021 02:08 IST

బాలాపూర్‌ గణనాథుడికి తొలగిన అడ్డంకి

శోభాయాత్రకు ఆటంకం లేకుండా రైల్వే వంతెన పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: బాలాపూర్‌ గణేశ్‌ శోభాయాత్రకు అడ్డంకి తొలగింది. ఏళ్ల నుంచి బాలాపూర్‌ గణేశ్‌ యాత్ర చాంద్రాయణగుట్ట నుంచి ఫలక్‌నుమా రైల్వే పైవంతెన(ఆర్‌వోబీ) మీదుగా చార్మినార్‌ వైపు సాగుతుంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏడాది క్రితం ఆర్‌వోబీకి మరమ్మతులు మొదలయ్యాయి. చాంద్రాయణగుట్ట కూడలి వద్ద పైపులైను కోసం గుంతలు తవ్వారు. ఆదివారం శోభాయాత్ర ఉండటంతో బల్దియా అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. అలాగే శనివారం సాయంత్రానికి ఆర్‌వోబీనీ అందుబాటులోకి తెచ్చారు. పూర్తిస్థాయిలో రోడ్డు మార్గం అందుబాటులోకి రాలేదని, శోభాయాత్ర వరకే అనుమతిస్తామని జీహెచ్‌ఎంసీ పోలీసులకు స్పష్టం చేయడంతో.. కేవలం బాలాపూర్‌ గణేశ్‌ యాత్రకు వారు పచ్చజెండా ఊపారు. మిగిలిన విగ్రహాలు కందికల్‌గేట్‌ మీదుగా లాల్‌దర్వాజా మార్గం నుంచి చార్మినార్‌కు చేరుకోనున్నాయి. అక్కడి నుంచి ఎప్పటిలాగే మూసీ మీదుగా అబిడ్స్‌ వైపు సాగనున్నాయి. చార్మినార్‌ జోన్‌ పరిధిలో శోభాయాత్రకు సంబంధించిన కంట్రోల్‌ రూంను సర్దార్‌ మహల్‌లో ఏర్పాటు చేశామని జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌ తెలిపారు. శోభయాత్ర జరగనున్న అన్ని రోడ్డు మార్గాలపై జీహెచ్‌ఎంసీ అవసరమైన ఏర్పాట్లు చేసింది. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు 21 మంది సిబ్బందితో కూడిన గణేశ్‌ యాక్షన్‌ టీంలు నియమించింది. జలమండలి సైతం తాగునీటి వితరణ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని