అదనపు కట్నం తీసుకురా... కట్టుకున్న భార్యను కెనడాలో వదిలేసిన భర్త
eenadu telugu news
Updated : 19/09/2021 05:26 IST

అదనపు కట్నం తీసుకురా... కట్టుకున్న భార్యను కెనడాలో వదిలేసిన భర్త

విదేశాంగశాఖ మంత్రికి ఫిర్యాదు... స్పందించిన రాచకొండ కమిషనర్‌


దీప్తి ట్వీట్‌

ఈనాడు, హైదరాబాద్‌, భువనగిరి నేరవిభాగం: మనువాడిన సంవత్సరానికే అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించిన భర్త.. అంతటితో ఆగకుండా ఆమెను కెనడాలో వదిలేసి నలభైరోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. దీంతో ఆమె కెనడాలోని భారత హైకమిషనర్‌కు గత నెల 20న ఫిర్యాదు చేసింది. స్పందన రాకపోవడంతో అతికష్టమ్మీద ఈ నెల 10న స్వస్థలానికి చేరుకుంది. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్‌ జయశంకర్‌కు తన ఆవేదనను ట్వీట్‌ చేసింది. స్పందించిన రాచకొండ సీపీ భువనగిరి ఠాణాలో కేసు నమోదు చేయించారు. పోలీసులు.. బాధితుల శనివారం వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్లకు చెందిన ఏనుగుల చంద్రశేఖర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దీప్తిరెడ్డితో గతేడాది మార్చిలో పెళ్లయ్యింది. దీప్తిరెడ్డి తల్లిదండ్రులు రూ.50 లక్షల నగదు, 50 తులాల బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చారు. పెళ్లైన కొద్దిరోజులకు చంద్రశేఖర్‌రెడ్డి కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లాడు. కొన్ని నెలల తర్వాత తన భార్య దీప్తిరెడ్డిని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక అదనంగా మరో రూ.30 లక్షల కట్నం తేవాలంటూ భార్యను వేధించాడు. తన తల్లిదండ్రులకు అంత తాహతు లేదని చెప్పడంతో ఆగస్టు 9న ఆమెకు అక్కడే వదిలేసి వచ్చాడు.


రాచకొండ కమిషనర్‌ స్పందన

గర్భవతినన్న కనికరంలేదు..

స్నేహితులు, బంధువుల సాయంతో ఇక్కడికి చేరుకున్న దీప్తిరెడ్డి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. మూడునెలల గర్భవతినన్న కనికరం లేకుండా తన భర్త వదిలేసి వచ్చాడంటూ తన ఆవేదనను కేంద్ర విదేశాంగమంత్రి డాక్టర్‌ జయశంకర్‌కు తెలిపింది. విదేశాంగశాఖ సూచనలతో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ స్పందించారు. భువనగిరి ఠాణాలో ఫిర్యాదు చేయాలంటూ దీప్తిరెడ్డికి చెప్పారు. శనివారం దీప్తిరెడ్డి భర్త చంద్రశేఖర్‌రెడ్డి, మీర్‌పేట ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె బావ శ్రీనివాసరెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. దీప్తిరెడ్డికి చట్టప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భువనగిరి ఏసీపీకి ఫోన్‌ చేసి దీప్తిరెడ్డి ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని