చారిత్రక భవనం.. కానున్నది మూ్యజియం
eenadu telugu news
Published : 19/09/2021 02:27 IST

చారిత్రక భవనం.. కానున్నది మూ్యజియం

అబిడ్స్‌లోని గోల్డెన్‌ త్రెషోల్డ్‌ భవనం ఆధునికీకరణకు హెచ్‌సీయూ చర్యలు

సరోజినీ నాయుడు జ్ఞాపకాలతో మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌


గోల్డెన్‌ త్రెషోల్డ్‌ భవనం

నగరం నడిబొడ్డున ఉన్న గోల్డెన్‌ త్రెషోల్డ్‌ భవనం పరిరక్షణకు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం చర్యలు చేపడుతోంది. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన భవనాన్ని మ్యూజియంగా మార్చాలని భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రొ.బీజేరావు భవనాన్ని పరిశీలించారు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆధునికీకరణకు చర్యలు తీసుకోనున్నారు. 2024లో హెచ్‌సీయూ నిర్వహించనున్న స్వర్ణోత్సవాల వరకల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదీ చరిత్ర

అబిడ్స్‌-నాంపల్లి రోడ్డులోని గోల్డెన్‌ త్రెషోల్డ్‌ భవనానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీనాయుడు ఇక్కడే నివాసం ఉండేవారు. ఈ భవనాన్ని మహాత్మాగాంధీ రెండుసార్లు సందర్శించారు. మహాత్ముడు ఎరవాడ జైలు నుంచి వచ్చే సమయంలో మామిడి మొక్క తీసుకువచ్చి ఇదే భవనంలోని వెనుకవైపు నాటాడు. స్వాతంత్య్రం రాకమునుపు కాంగ్రెస్‌ నాయకుల సమావేశాలు భవనంలోనే జరిగేవి. 1975 నవంబరు 17న సరోజినీనాయుడు కుమార్తె పద్మజానాయుడు విజ్ఞప్తితో భవనాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జాతికి అంకితమిచ్చారు. ఇదే ప్రాంగణం నుంచి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం భవనం హెచ్‌సీయూ అధీనంలోనే ఉంది. ప్రస్తుతం భవనం వెనుక హెచ్‌సీయూ దూరవిద్య కేంద్రం కొనసాగుతోంది. రెండేళ్ల కిందట వర్సిటీకి కేంద్ర ప్రభుత్వం శ్రేష్ఠ హోదా కల్పించింది. దీని కింద రూ.వేయి కోట్లు దశల వారీగా రానున్నాయి. ఈ నిధులలో కొంత మేర కేటాయించి గోల్డెన్‌ త్రెషోల్డ్‌ భవనాన్ని ఆధునికీకరించి మ్యూజియం, ఆర్ట్‌గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు. ‘‘యూనివర్సిటీ ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆధునికీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది’’ అని హెచ్‌సీయూ దూరవిద్య కేంద్రం సంచాలకుడు ప్రొ.ఎస్‌.జిలానీ తెలిపారు.

దానిని పరిశీలిస్తున్న ఉపకులపతి ప్రొ.బీజేరావు తదితరులు

త్వరలో అవగాహన ఒప్పందం

భవనానికి మరమ్మతులు చేసేందుకు రెండేళ్ల కిందటే ఇంటాక్ట్‌ సంస్థతో హెచ్‌సీయూ చర్చించింది. ఇద్దరు అర్కిటెక్టులు సమగ్ర అధ్యయనం చేసి రూ.4 కోట్ల ఖర్చు అంచనా రూపొందించారు. త్వరలోనే మరోసారి ఇంటాక్ట్‌ సంస్థతో చర్చించి అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్‌సీయూ భావిస్తోంది.

ఏమేం చేస్తారంటే..

సరోజినీనాయుడు జ్ఞాపకాలతో మ్యూజియం, ఆర్ట్‌గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. కేవలం విశ్వవిద్యాలయ అవసరాలకే కాకుండా తక్కువ రుసుములతో బయటి వ్యక్తులు, సంస్థలకు ఇవ్వనున్నారు.

* భవనం వెనకనున్న మరో కట్టడంలో గోపాల్‌ క్లినిక్‌లో జనశిక్షణ సంస్థాన్‌ కార్యాలయం నడుస్తోంది. దీనికి మరమ్మతులు చేస్తారు.

* ఇప్పటికే రాజకుమారి ఇందిరాదేవి హాలు అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఉపన్యాస సదస్సులు, కవితాగోష్టి వంటి సదస్సులకు ఇవ్వనున్నారు.

* భవనం వెనుక ఉన్న ఓపెన్‌ ఆడిటోరియానికి మరమ్మతులు చేస్తారు. మరో ఆడిటోరియంలో ప్రత్యేకంగా సాంస్కృతిక కేంద్రం నిర్మించనున్నారు.


సమాజ అవసరాల నిమిత్తం

- ప్రొ.వినోద్‌ పావరాల, హెచ్‌సీయూ ఆచార్యుడు

సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌సీయూ వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. గతంలోనే భవనం ఆధునికీకరణకు చర్యలు చేపట్టినా.. కరోనా కారణంగా ముందుకు సాగలేదు. ఇంటాక్ట్‌ను సంప్రదించి అవసరమైన చర్యలు చేపడతాం. ప్రధానంగా మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని