ప్రతి కూడలి.. భక్త కడలి
eenadu telugu news
Published : 20/09/2021 02:15 IST

ప్రతి కూడలి.. భక్త కడలి

మట్టి గణపతికి జైకొట్టి..

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, ఈనాడు, హైదరాబాద్‌: నగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరిగింది. మట్టి గణపతికి జైకొట్టారు. కాలనీ సంక్షేమ సంఘాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసి పర్యావరణ ప్రేమికులనిపించుకున్నారు. ఇళ్లలో పూజలందుకున్న చిన్న విగ్రహాలను బకెట్లలో నిమజ్జనం చేసి స్ఫూర్తిగా నిలిచారు. ఏటా మట్టి గణపతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది హెచ్‌ఎండీఏ 70 వేలు, పీసీబీ 50 వేల మట్టి విగ్రహాలను(పది అంగుళాల ఎత్తు) ఉచితంగా పంపిణీ చేశాయి. పలువురు స్వచ్ఛందంగా మూడు నుంచి అయిదు అడుగుల విగ్రహాలను నెలకొల్పారు. నగరవాసుల ఆలోచన తీరుకు అనుగుణంగా తయారీదారులు సైతం భారీ సంఖ్యలో మట్టి ప్రతిమలను అందుబాటులోకి తెచ్చారు.

మల్కాజిగిరి ఆర్‌కేనగర్‌లో డైనమిక్‌ యూత్‌ ఆధ్వర్యంలో 2 అడుగుల మట్టి గణపయ్యకు నిమజ్జనం

అక్కడ పక్కాగా ఏర్పాట్లు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, అబిడ్స్‌: ఎంజే మార్కెట్‌ ఆదివారం గణనాథులను తిలకించేందుకు వచ్చిన భక్తులతో సందడిగా కనిపించింది. ఈ మేరకు భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ఘనంగా ఏర్పాట్లు చేసింది. బాలాపూర్‌ వినాయకుడు ఇదే మార్గంలో ట్యాంక్‌బండ్‌కు వెళ్తుండటంతో గణనాథుడిని చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. చార్మినార్‌, ఫలక్‌నుమా, చాదర్‌ఘాట్‌, శాలిబండ, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, గోషామహల్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే గణనాథులకు ఎంజేమార్కెట్‌ ప్రధాన కూడలి వద్ద భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యులు స్వాగతం పలుకుతూ అందరిలో ఉత్సాహం నింపారు.


వాహనాల గమనం పరిశీలిస్తున్న సీపీ అంజనీ కుమార్‌

తెరపై ప్రత్యక్ష ప్రసారం

ఈనాడు, హైదరాబాద్‌: గణపతి నిమజ్జనాన్ని ఉన్న చోటు నుంచే తిలకించాలనుకొనే వారి కోసం ఈ ఏడాది పోలీసు యంత్రాంగం వినూత్న మార్గాన్ని ఎంచుకొంది. హైదరాబాద్‌ పోలీసు ట్విటర్‌ హ్యాండిల్‌, ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. పోలీసు కమిషనరేట్‌లోని ఐటీ బృందం అధికారులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చి 4జీ కనెక్టివిటీ ద్వారా హుస్సేన్‌సాగర్‌ నుంచి కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. నిమజ్జన ప్రక్రియ ఆరంభం కాగానే ప్రత్యక్ష ప్రసారం మొదలుపెట్టారు. జియోట్యాగింగ్‌ ద్వారా విగ్రహాల గమనాన్ని క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చేరవేశారు.

అన్ని విభాగాల సేవలు భళా

గణేశ్‌ నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనారోగ్య సమస్యలొస్తే.. సత్వర వైద్యసేవలకు వీలుగా ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. భక్తుల్లో ఎవరైనా కళ్లు తిరిగి పడిపోయినా.. వారికి సెలైన్‌లు ఎక్కించి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో జలమండలి ఎండీ దానకిషోర్‌ ఉచిత తాగునీటి శిబిరాల్ని ఏర్పాటు చేయించారు. బల్దియా ఆధ్వర్యంలో సంచార శౌచాలయాలనూ అందుబాటులోకి తెచ్చారు.

సొంత వాహనంలోనే పయనం

ఈసారి నిమజ్జన కోలాహలంలో రవాణా వాహనాల కంటే అధికంగా వ్యక్తిగత వాహనాల సందడి కనిపించింది. కొందరు ద్విచక్ర వాహనాలు.. మరికొందరు కార్లలో తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. రెండు నుంచి నాలుగు అడుగుల వరకు విగ్రహాలను కార్లకుపైన కట్టి సందడిగా నిమజ్జనానికి తరలించారు. ట్యాంక్‌బండ్‌, ఇతర కొలనుల వద్దకు తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. నృత్యాలు చేసుకుంటూ లంబోదరుడికి వీడ్కోలు పలికారు. దీనికితోడు రవాణా వాహనాలు భారీగా రుసుములు వసూలు చేయడంతో వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించారు.


సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలకు చెందిన లక్ష్మణ్‌ స్కేటింగ్‌ చేస్తూ సాగర్‌కు వచ్చి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తన ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడితో సుమారు 30 కి.మీ. స్కేటింగ్‌ చేశారు.

-న్యూస్‌టుడే, కుత్బుల్లాపూర్‌


ఇంట్లో కొలిచి.. బస్సులో వచ్చి

 

ఈనాడు, హైదరాబాద్‌: ఇంట్లో ప్రతిష్ఠించిన మట్టి గణపతిని నిమజ్జనం చేసేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ బస్సులో హుస్సేన్‌సాగర్‌ వచ్చారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనను వీడియో తీసిన కొందరు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. తెలుపు రంగు దుస్తులు, టోపీ ధరించిన వీసీ సజ్జనార్‌.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఈ వీడియోలో కొందరు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.●


స్పీడు బోటులో నిమజ్జనం పరిశీలిస్తున్న మేయర్‌ విజయలక్ష్మి

● దారులు శుభ్రంగా.. భక్తులు భద్రంగా

భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలినప్పటికీ.. కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అపశ్రుతులు చోటు చేసుకోలేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది మెరుగ్గా పనిచేశారు. అపరిశుభ్రతకు తావులేకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను శుభ్రం చేశారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరవ్యాప్తంగా పర్యటించారు. హుస్సేన్‌సాగర్‌లోని స్పీడు బోటులో ప్రయాణించి క్రేన్ల పనితీరును పరిశీలించారు. ఖైరతాబాద్‌ పెద్ద గణేశ్‌, బాలాపూర్‌ గణేశ్‌ విగ్రహాలకు పూజలు చేసి స్వాగతం పలికారు. తాగునీరు, ఇతర వసతులను పరిశీలించారు.●


కడుపు నింపిన.. పులిహోర, చక్కెరపొంగలి

ఏడాదికోసారి వచ్చే నిమజ్జనోత్సవం.. పార్వతీ సుతుడు తుది పూజలందుకునే ఘట్టాన్ని కనులారా చూడాలని.. వేలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్‌ పరిసరాలకు చేరుకున్నారు. కాసేపటికి కడుపులో పేగులు అరవడం ప్రారంభించాయి..! ఆ సమయంలో భక్తుల ఆకలిని తీరుస్తూ గణనాథుల శోభాయాత్ర నిర్వాహకులు ఆసరాగా నిలిచారు. నిమజ్జన యాత్ర వాహనాల వెంట తీసుకువచ్చిన ప్రసాదాన్ని భక్తులకు పంచి ఆకలి తీర్చారు. పలుచోట్ల భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నాయకులు వేదికలు ఏర్పాటు చేసి గణనాథులకు స్వాగతం పలికారు. అక్కడే పులిహోర, చక్కెరపొంగలి వంటి ప్రసాదాలనూ భక్తులకు పంపిణీ చేశారు.

నూరు కోట్లు ఇచ్చారు.. నోరారా తిన్నారు..

గణేష్‌ నిమజ్జనోత్సవాల్లో గత ఐదు రోజుల్లో చిరు వ్యాపారస్థులు ఏకంగా రూ.100 కోట్ల వ్యాపారం చేసినట్లు అంచనా. ఈ పరిసరాల్లో ఆట బొమ్మలు, చిరుతిళ్లు, పచ్చబొట్ల కేంద్రాలు కిటకిటలాడాయి. శనివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా రోడ్లపై వ్యాపార కేంద్రాల వద్ద జనం సందడి కనిపించింది.●

ట్యాంక్‌బండ్‌ వైపే ఎక్కువ రద్దీ!

హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్యాంక్‌బండ్‌ వైపే ఎక్కువగా గణనాథుల రాకతో రద్దీ నెలకొంది. పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్‌బండ్‌ మార్గంలో నిమజ్జనానికి పోలీసులు, అధికారులు అనుమతించారు. అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాటిని ఐ-మ్యాక్స్‌ మార్గంలో పంపించారు. దీనివల్ల పెద్దఎత్తున విగ్రహాలు ట్యాంక్‌బండ్‌ మార్గంలోనే నిమజ్జనం అయ్యాయి. ●

పాతబస్తీలో స్వాగత వేదికల వద్ద సందడి..

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, చార్మినార్‌: గణనాథుడి నిమజ్జనోత్సవం పాతబస్తీలో ఉల్లాసంగా, ఉత్సాహంగా కొనసాగింది. చార్మినార్‌ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాల నుంచి గణనాథులకు ఆహ్వానం పలుకుతుండగా.. వాహనాల ముందు యువతీ యువకుల నృత్యాలు అలరించాయి. చార్మినార్‌ మీదుగా మదీనా క్రాస్‌రోడ్‌, పురానాపూల్‌, ఎంజే మార్కెట్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌ల నుంచి విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌కు చేరుకున్నాయి. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా పాతబస్తీలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిలు పాతబస్తీలో పర్యటించి ఊరేగింపు తీరును పరిశీలించారు. ●

నిబంధనలకు నీళ్లొదిలి

ట్యాంక్‌బండ్‌కు తండోపతండాలుగా తరలివచ్చిన జనం కరోనా నిబంధనలను పూర్తిగా విస్మరించారు. చాలా మంది, ముఖ్యంగా యువత మాస్క్‌ ధరించకుండానే శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎడం పాటించకుండా గుంపు గుంపులుగా పోగయ్యారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని నిమజ్జనం చేసే ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ 4 వద్దకు వేలాది మంది తరలివచ్చారు. తోసుకుంటూ స్వీయ చిత్రాలు తీసుకొనేందుకు ఎగబడ్డారు. పోలీసులు ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు గమనిస్తూ పదేపదే కరోనా జాగ్రత్తలు పాటించాలని చాటిచెప్పినా ఫలితం లేకపోయింది. ఒకానొక దశలో తీవ్రంగా హెచ్చరించారు.●

ఎప్పటికప్పుడు.. వ్యర్థాల తరలింపు

నిమజ్జన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ను నిమజ్జనం చేసే చోట లోతు తక్కువగా ఉండటంతో విగ్రహం పూర్తిగా మునిగేందుకు ఏటా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్క లోతు 10 అడుగులు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించి ప్రత్యేక యంత్రాల సాయంతో మరో 40 అడుగుల లోతు మట్టి తీయించారు. పారిశుద్ధ్యం నుంచి తాగునీటి వితరణ వరకు నిమజ్జన వేడుకల్లో కార్మికులు చమటోడ్చారు. జీహెచ్‌ఎంసీ నుంచి 9వేల మంది, జలమండలి, హెచ్‌ఎండీఏల నుంచి 2వేల మంది వేర్వేరుగా విధులు నిర్వర్తించారు. ముఖ్యంగా.. నిమజ్జన కోనేరుల వద్ద బల్దియా దోమల నివారణ విభాగానికి చెందిన 1667 మంది కార్మికులు మూడు విడతల్లో సేవలందించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని