Crime News: కూతురిపై దాష్టీకం.. మద్యం మత్తులో చితకబాదిన తండ్రి
eenadu telugu news
Updated : 21/09/2021 08:16 IST

Crime News: కూతురిపై దాష్టీకం.. మద్యం మత్తులో చితకబాదిన తండ్రి

మెదక్‌, న్యూస్‌టుడే: అల్లారు ముద్దుగా పెంచాల్సిన కూతురిపై ఓ తండ్రి దాష్టీకాన్ని ప్రదర్శించాడు. మద్యం మత్తులో ఉన్న అతను తాడుతో దారుణంగా కొట్టిన ఘటన మెదక్‌ పట్టణంలో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పట్టణ ఎస్‌ఐ పోచయ్య తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని జంబికుంటకు చెందిన నాగరాజు గత నెలలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో రోజు వారీ కూలీగా చేరాడు. అతడు కొన్నాళ్ల కిందట ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత మరో మహిళను వివాహం చేసుకోగా ఆమెతో కలిసి స్థానిక తారకరామనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రెండో భార్య తన మూడేళ్ల కుమార్తెకు అన్నం తినిపిస్తుండగా.. నాగరాజు తాడుతో పలు మార్లు కొట్టాడు. దీన్ని కాలనీవాసులు వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. చిన్నారిని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని