విద్యుదాఘాతానికి ఇద్దరు బలి..
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

విద్యుదాఘాతానికి ఇద్దరు బలి..

మెదక్‌లో రైతు.. సిద్దిపేటలో కూలీ..

నర్సింలు

మెదక్‌, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన మెదక్‌ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ పోచయ్య తెలిపిన వివరాలు.. స్థానిక దాయర వీధికి చెందిన మావుర్ల నర్సింలు (48) వ్యవసాయమే ఆధారంగా కుటుంబాన్ని పోషించకుంటున్నాడు. భార్య తులసమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎకరంన్నర భూమి ఉండగా.. వరి సాగు చేశాడు. ఆదివారం మధ్యాహ్నం పొలానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరారు. సాయంత్రం పొలంలో గడ్డి కోస్తున్న సమయంలో అక్కడ పడి ఉన్న తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్ద వెతికారు. అక్కడ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి రోదించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ వెంకటయ్య, సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. సోమవారం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

సిద్దిపేట టౌన్‌: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందినట్లు సిద్దిపేట టూ టౌన్‌ సీఐ పరశురాంగౌడ్‌ తెలిపారు. వివరాలు.. చేర్యాల మండలం కొత్తదొమ్మాటకు చెందిన ఎలుముల శ్రీనివాస్‌ (37) కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం చేర్యాలకు చెందిన ఓ వ్యక్తి సిద్దిపేటలోని కుశాల్‌నగర్‌లో ఇంటికి రంగుల అద్దకానికి కూలీ మాట్లాడుకొని తీసుకెళ్లాడు. పని చేస్తుండగా ఇంటి ముందున్న మీటరు సమీపంలో గోడకు రంగులు అద్దబోయాడు. ఈక్రమంలో సర్వీసు తీగ తగిలి విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడాడు. అక్కడున్న వారు అతన్ని స్థానిక సర్వజన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సోమవారం మృతుడి భార్య సుధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని