నీళ్లు, విద్యుత్తు గోస తీర్చిన ఘనత తెరాసదే
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

నీళ్లు, విద్యుత్తు గోస తీర్చిన ఘనత తెరాసదే

రెండో విడతలో వేగంగా గొర్రెల యూనిట్ల పంపిణీ
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

చేప పిల్లలు వదులుతున్న మంత్రి, ఎమ్మెల్యే, పాలనాధికారి తదితరులు

బెజ్జంకి, న్యూస్‌టుడే: ఏడేళ్లలో తాగు, సాగునీటికి, విద్యుత్తు కష్టాలు తీర్చిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. సోమవారం బెజ్జంకి మండలం తోటపల్లి జలాశయంలో చేప, రొయ్య పిల్లలను రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, పాలనాధికారి వెంకటరామరెడ్డిలతో కలిసి వదిలారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుండగా, కాంగ్రెస్‌, భాజపా నాయకులు బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇక్కడి పథకాలు భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. భాజపా ప్రజల మన్ననలు పొందాలంటే రాష్ట్రానికి ఓ ప్రాజెక్టును తీసుకురావాలన్నారు. ఈ సారి రూ.115 కోట్లతో 93 కోట్ల చేప పిల్లలు, 25 కోట్ల రొయ్య పిల్లలను వనరుల్లో వదలనున్నామని తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీలో ప్రస్తుతం యూనిట్‌ రూ.1.75 లక్షలకు పెరిగిందని, చెల్లించిన నెల రోజుల్లోనే ఇస్తామని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే రసమయి విన్నపం మేరకు బెజ్జంకి, బేగంపేట, తోటపల్లి గ్రామాల్లో చేపల మార్కెట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు. అనంతరం సంచార వాహనాలను ప్రారంభించారు. మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరామ్‌ భూక్యా, ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు కవిత, సర్పంచి నర్సింగరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూదన్‌, ఆర్డీవో జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని