వడ్డీ సొమ్ము.. వృద్ధికి దన్ను
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

వడ్డీ సొమ్ము.. వృద్ధికి దన్ను

మహిళా సంఘాలకు రూ.3.23 కోట్ల బకాయిలు విడుదల
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ గ్రామీణ

సమావేశమైన సంఘ సభ్యులు

హిళా పొదుపు సంఘాలకు ప్రభుత్వం వడ్డీ సొమ్మును విడుదల చేసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సంఘాలకు ఊరట లభించింది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు వస్తాయని భావించినా 2018-19 జులై వరకు మాత్రమే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా 15,524 పొదుపు సంఘాలు ఉండగా 1,66,483 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 648 గ్రామ సమాఖ్య సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో మొత్తంగా 6,673 సంఘాలకు రూ.3.23 కోట్లు విడుదలయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి 10,587 సంఘాలకు రూ.13.99 కోట్లు, 2015-16లో 10,040 సంఘాలకు రూ.13.79 కోట్లు, 2016-17లో ఆర్థిక సంవత్సరంలో 9,613 సంఘాలకు రూ.12.75 కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 10,225 సంఘాలకు రూ.12.49 కోట్లు మంజూరు చేసింది. తాజాగా వచ్చిన సొమ్ముతో వడ్డీ భారం తగ్గిందని సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బకాయిలన్నీ ఒకేసారి విడుదల చేసినట్లయితే వెంటాడుతున్న ఆర్థిక సమస్యలకు తెర పడుతుండేందని చిన్నచిన్న పరిశ్రమలను ఏర్పాటుతో స్వయం ఉపాధికి మరింత మార్గం సుగమం అయ్యేదని పలువురు సంఘ సభ్యులు అభిప్రాయపడ్డారు.

బకాయిలు ఇలా..: పొదుపు సంఘాల ద్వారా మహిళా సాధికారత సాధించాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈక్రమంలోనే నూతనంగా ఏర్పడిన సంఘాలను ప్రోత్సహించడం, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడం, పొదుపు అలవాట్లు నేర్పేందుకు వడ్డీ సొమ్మును అందజేస్తోంది. మూడేళ్లుగా ఇంకా బకాయిలు విడుదల కావాల్సి ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 8,695 సంఘాలకు రూ.9.07 కోట్లు, 2019-20కి 9,499 సంఘాలకు రూ.20.33 కోట్లు, 2020-21కి 9,744 సంఘాలకు రూ.19.01కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. మొత్తంగా 9,744 సంఘాలకు ఇప్పటివరకు రూ.48.42కోట్లు ఉన్నాయి. బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణాలను మహిళలు తలా కొంత తీసుకుని వివిధ యూనిట్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. నెలనెలా వడ్డీని బ్యాంకులకు చెల్లిస్తున్నారు. దీంతో కొంత భారం తగ్గనుంది.
రుణ ఖాతాలో జమ: ప్రభుత్వం మంజూరు చేస్తున్న వడ్డీ సొమ్ము నేరుగా సంఘాలకు సంబంధించిన రుణ ఖాతాలో జమకానుంది. దీంతో ఆయా సంఘాలు తీసుకున్న రుణ మొత్తం సొమ్ము అందులోనుంచి తగ్గనుంది. ఏ యేటికాయేడు సొమ్ము విడుదల కాని కారణంగా సంఘ సభ్యులకు వడ్డీ కట్టడం తలకుమించిన భారంగా పరిణమించింది. బ్యాంకులకు ఏదేనీ కారణాలతో చెల్లించకుంటే రుణ మంజూరు సమయంలో బ్యాంకర్లు కొర్రీలు పెట్టేవారు. కరోనా కారణంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బకాయిలన్నీ ఏకకాలంలో విడుదల చేసి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.


సంతోషంగా ఉంది
అనిత, మండల మహిళా సమాఖ్య కార్యదర్శి

మూడేళ్ల విరామం అనంతరం వడ్డీ సొమ్మును విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఉన్న బకాయిలన్నీ ఒకేసారి విడుదల చేస్తే బాగుండేది. ఒకేసారి రుణం తగ్గిపోతే బ్యాంకర్లు కూడా కొత్త రుణాలను ఇచ్చేందుకు ఉత్సాహం చూపుతారు. అనేక సంఘాలు క్రమం తప్పకుండా బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తున్నాయి.


ఉపాధి యూనిట్లపై దృష్టి సారించాలి
శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం, పరిగి

వడ్డీ సొమ్ము మంజూరు కావడం హర్షణీయం. ఇది సంఘాల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. చాలా సంఘాలు పొదుపు విషయంలో పోటాపోటీగా వ్యవహరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. సంఘ సభ్యులు తీసుకున్న రుణాలను వ్యవసాయాభివృద్ధి పనులకే కాకుండా స్వయం ఉపాధి యూనిట్లపై దృష్టి సారిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని