దాచేస్తే నష్టం.. వైద్యంతో నయం
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

దాచేస్తే నష్టం.. వైద్యంతో నయం

క్షయపై వైద్యుల అవగాహన
నవంబరు వరకు ప్రత్యేక కార్యక్రమం

రోగిని పరీక్షిస్తున్న డాక్టర్‌

న్యూస్‌టుడే,వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లాలో క్షయను నిర్మూలించేందుకు వైద్యాధికారులు కార్యాచరణ చేపట్టారు. అవగాహన కల్పించడం, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ వంటివి చేపడుతున్నారు. దేశంలో 2025 వరకు వ్యాధిని పూర్తిగా పారదోలాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ వ్యాధి మైక్రోబ్యాక్టీరియాతో ఇతరులకు సక్రమిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపి, తీవ్రమైన అనారోగ్యాన్ని గురిచేస్తుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదని యాంటీబయాటిక్స్‌తో బాగు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గడం, తుమ్మడం, లేదా మాట్లాడటంతో క్రిములు గాలిలో కలిసిపోతాయి. ఇతరులు ఈ గాలిని పీల్చినపుడు సోకుతుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులపై దీని ప్రభావం తక్కువే. వ్యాధి వచ్చిన వారు క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే నయమవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత పరీక్షలతో పాటు మందులు అందజేస్తున్నారు. వారం పది రోజుల పాటు దగ్గు తక్కువ కాకుంటే, పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంటింటి సర్వేలో 5 బృందాలు: ఈనెల 6 నుంచి నవంబరు 1వ తేదీ వరకు రోగులను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. ఇందుకోసం జిల్లాలో అయిదు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందం నిత్యం 100 గృహాలను సందర్శించి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి రోజు 500 ఇళ్లను సందర్శిస్తారు. వ్యాధి ఉన్న వారి వివరాలతో పాటు హెచ్‌ఐవీ పాజిటివ్‌, మధుమేహం ఉన్న వారిని గుర్తించి, వారి జాబితాను ఉన్నతాధికారులకు అందజేస్తారు.
జిల్లాలో 1600 మంది: జిల్లాలో ఓ సంస్థ నివేదిక ప్రకారంగా 1600 మంది వ్యాధిగ్రస్తులున్నారు. అయితే 813 మందిని మాత్రమే గుర్తించి వైద్యులు మందులు అందజేస్తున్నారు. మిగిలిన వారి వివరాలు సేకరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో చాలా వరకు వ్యాధి ఉన్న వారు చెప్పేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. గుట్టుగా ఉన్న ఇటువంటి వారిని గుర్తించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని ఆర్‌ఏపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎక్కువ రోజుల నుంచి దగ్గు, దమ్ముతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే విధంగా సూచించి వారిని ఆసుపత్రికి పంపించాలని కోరుతున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి.  
ప్రభుత్వ ఆసుపత్రిలో..: ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయకు మెరుగైన వైద్యం అందజేస్తున్నారు. అధునాతనమైన విధానంతోనే చికిత్సను అందజేస్తారు. రోగికి ఆసుపత్రికి వస్తే మందులతో పాటు రూ.500 ఖాతాలో జమ చేస్తారు. ప్రైవేట్‌ వైద్యులు రోగిని ఆసుపత్రికి పంపిస్తే వారికి ప్రోత్సాహంగా వెయ్యి రూపాయలను అందజేస్తారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే మల్టీడ్రగ్స్‌ను 12 నెలల పాటు ఇస్తారు. వీటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
అధునాతన యంత్రాలతో పరీక్షలు
డాక్టర్‌ రవీందర్‌ యాదవ్‌, జిల్లా అధికారి

వ్యాధి ఉన్న వారు దాచిపెట్టకుండా ప్రభుత్వ ఆసుపత్రికి ధైర్యంగా వచ్చి చికిత్స తీసుకోవాలి. ఆసుపత్రిలో ఖరీదైన మందులను ఇచ్చి ఆరు నెలల్లో తగ్గిస్తారు. అధునాతనమైన యంత్రం ద్వారా వ్యాధి తీవ్రతను తెలుసుకోని చికిత్స చేస్తారు. వారికి ప్రోత్సాహకాన్ని అందజేస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని