నిక్షేప గని.. నిరంతర నిధి!
eenadu telugu news
Updated : 21/09/2021 05:13 IST

నిక్షేప గని.. నిరంతర నిధి!

తాండూరులో విస్తరించిన నాపరాళ్ల పరిశ్రమ
న్యూస్‌టుడే, తాండూరు

పనిచేస్తున్న కార్మికులు

నాపరాయి పేరు వినగానే తాండూరు పేరే గుర్తుకొస్తుంది. రాష్ట్రంలోనే నాపరాళ్లు అత్యధికంగా దొరికేది ఇక్కడే కావడం గమనార్హం. దీంతో ఈ పరిశ్రమ విస్తరించింది. తద్వారా నిత్యం 20 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇక ఆయా బండలను విక్రయించే వ్యాపారం రోజుకు రూ.కోట్లలోనే ఉంటుంది. ప్రభుత్వానికి సైతం వివిధ రూపాల్లో ఏడాదికి రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది.
ఎక్కడ ఉన్నాయంటే..
తాండూరు మండలం కరణ్‌కోట, మల్కాపూర్‌, ఓగిపూరు, కోటబాస్పల్లి, సిరిగిరిపేట, గుంతబాస్పల్లి, మిట్టబాస్పల్లి, బషీరాబాద్‌ మండలం నవల్గ, కొర్విచేడ్‌ గని గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో నాపరాళ్ల ఖనిజాలు లభ్యమవుతాయి. ఇక్కడ వెలికి తీసిన నాపరాళ్లు నీలి, తెలుపు రంగులో ఉంటాయి. మన దేశంలో తమిళనాడు, గోవా, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తదితర రాష్ట్రాలకు తాండూరు నుంచి ఎగుమతి అవుతుంటాయి. విదేశాల్లోనూ ఇక్కడి బండలకు అధిక డిమాండ్‌ ఉంది.
నునుపుగా మారుతుందిలా..
గనుల్లో వెలికితీసిన ముడి నాపరాయి నునుపుగా మార్చే ప్రకియ ప్రత్యేకంగా ఏర్పాటైన యూనిట్లలో జరుగుతుంది. గనుల్లో యంత్రాల ఆధారంగా వివిధ పరిమాణాల్లో కోసిన నాపరాయిని కార్మికులు పలకలుగా వెలికితీస్తారు. వాటిని నేరుగా నునుపుగా మార్చే యూనిట్లకు తరలిస్తారు. కార్మికులు నాపరాయిని మూడు దశల్లో నునుపుగా మారుస్తారు. యూనిట్లలో నాపరాయి కొసలు విరిగిపోతే వాటిని యంత్రాల ద్వారా కత్తిరించి కావాల్సిన పరిమాణంలోకి మారుస్తారు.
వేలాది మంది..
200కు పైగా లీజు పొందిన గనులు వందలాది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించాయి. ఒక్కో గనిలో ముడి నాపరాయిని వెలికి తీసే కార్మికులతో పాటు లారీల్లో లోడ్‌ చేసే కార్మికులు కలిపి 50 మందికి పైగా పని చేస్తూ కనిపిస్తారు. ఒక్కో కార్మికుడు పనిని బట్టి రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు సంపాదిస్తారు. ఇక గనుల్లోంచి వెలికితీసిన ముడి నాపరాయిని నునుపుగా మార్చడానికి తాండూరులో మరో 800 యూనిట్లు ఉన్నాయంటే ఇక్కడ ఈ వ్యాపారం ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది. వీటిల్లో యంత్రాల సామర్థ్యాన్ని బట్టి 10 మంది వరకు పని చేస్తుంటారు.
ప్రభుత్వానికి రూ.150 కోట్లపైనే..
తాండూరులోని గనులు, సిమెంటు కర్మాగారాలు, నునుపు యూనిట్ల నుంచి ప్రభుత్వానికి ఏటా కోట్ల రాబడి వస్తోంది. నాపరాళ్లను విక్రయించే సమయంలో వ్యాపారులు రాయల్టీ రూపకంగా గనుల శాఖకు, అమ్మకం పన్ను కింద వాణిజ్య శాఖ, ఆదాయ పన్ను శాఖకు  కలిపి రూ.150 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. ఇక విద్యుత్తును వినియోగిస్తున్నందుకు విద్యుత్తు శాఖకు ప్రతి నెలా రూ.3 కోట్లకు పైగా బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు.
సిమెంటు కర్మాగారాలు..
తాండూరులో సున్నపు రాయి గనుల ఆధారంగా సిమెంటు కర్మాగారాలు సైతం ఏర్పాటయ్యాయి. కరణ్‌కోటలో సీసీఐ, మల్కాపూరులో ఇండియా సిమెంట్స్‌, బెల్కటూరులో పెన్నా సిమెంటు కర్మాగారాలు వెలిశాయి. మూడు కర్మాగారాల్లో కలిపి రోజూ 12,000 టన్నుల సిమెంటు ఉత్పత్తి జరుగుతోంది. కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది కలిపి 4,000 మందికి పైగా ఉంటారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని