సవారీ.. అనుభూతి షికారీ
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

సవారీ.. అనుభూతి షికారీ

జంటనగరాల నుంచి నర్సాపూర్‌ వైపు రాక

సెలవు రోజుల్లో రైడర్ల సందడి

న్యూస్‌టుడే, నర్సాపూర్‌

సైకిల్‌పై వస్తున్న క్లబ్‌ సభ్యులు

క్షుల కిలకిలరావాలు.. వన్యప్రాణుల సంచారం.. పచ్చదనం.. ఆహ్లాదకర వాతావరణం మధ్య సైకిల్‌ సవారీ కొత్త అనుభూతి, ఉత్సాహం కలిగిస్తుంది. నర్సాపూర్‌ అటవీ ప్రాంతం.. అందునా జాతీయ రహదారి.. చూడతగిన విశేషాలెన్నో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన అర్బన్‌ పార్కు మరో ప్రత్యేకం. అందుకే సెలవు రోజులు వస్తే చాలు.. రైడర్ల సందడి కనిపిస్తుంది. కొందరు సైకిళ్లపై, మరికొందరు బుల్లెట్లపై ప్రయాణం సాగిస్తూ మరచిపోలేని అనుభూతిని పొందుతున్నారు. హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి రైడింగ్‌ చేస్తుంటారు.
ముందుగా నమోదు
వారాంతపు సెలవు దినాలు, పండగల సమయంలో వచ్చే సెలవుల్లో జంట నగరాల నుంచి పెద్ద ఎత్తున నర్సాపూర్‌-మెదక్‌ మార్గంలో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రైడింగ్‌ క్లబ్‌ల సభ్యులు తమ ద్విచక్ర వాహనాలపై నర్సాపూర్‌ వైపు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ వేదికగా నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. క్లబ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాట్సాప్‌ బృందాలలో ముందుగా రైడింగ్‌ తేదీని పోస్టు చేసి ఆసక్తి ఉన్న వారు పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తారు. ఇలా పేర్లు నమోదు చేసుకున్న వారంతా సెలవు రోజుల్లో ఏదో ఓ చోట కలుసుకొని అక్కడి నుంచి అందరూ కలిసి ర్యాలీగా బయల్దేరుతారు. ప్రత్యేక దుస్తులు ధరించి, ఆహార పదార్థాలు, తాగునీరు వెంట పెట్టుకుని ప్రయాణం సాగిస్తుంటారు. హైదరాబాద్‌లోని ఏదో ఓ ప్రాంతం నుంచి మొదలయ్యే ఈ రైడ్‌ సుమారు 50, 100 కి.మీ. మేర పొడవునా సాగిస్తుంటారు. మెదక్‌ - నర్సాపూర్‌ దారిని ఇటీవల జాతీయ రహదారిగా గుర్తించి విస్తరించడంతో ఇటువైపు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అర్బన్‌ పార్కు వద్ద సందడి

ఏడుపాయల వరకు..
హైదరాబాద్‌ సైక్లిస్ట్‌ అసోసియేషన్‌, తదితర సంస్థలు ఇలాంటి ప్రయాణాలను ప్రోత్సహిస్తున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డు బుల్లెట్‌ షోరూంల నిర్వాహకులు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి గండిమైసమ్మ, దుండిగల్‌, గాగిల్లాపూర్‌, అన్నారం, బొంతపల్లి, గుమ్మడిదల, నర్సాపూర్‌, వెంకట్రావుపేట, కౌడిపల్లి, కొల్చారం మీదుగా మెదక్‌ చర్చితో పాటు ఏడుపాయలకు వరకు ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇలా సెలవు  రోజుల్లో ఈ మార్గమంతా రైడర్లతో సందడిగా మారుతోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వాయుసేన ఉద్యోగులు తదితరులు వస్తున్న వారిలో ఉంటున్నారు. మహిళలు సైతం ఉంటున్నారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ, అటవీ మార్గంలో మలుపులు ఉన్న మార్గంలో వాహనాలు నడుపుతూ సందడి చేస్తున్నారు.
ఆదాయానికి అవకాశం..
వారాంతపు సెలవు దినాల్లో రైడర్లు, సందర్శకులతో నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో సందడి నెలకొంటుంది. వందలాది మంది ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి తరలివస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం చొరవ చూపి ఇక్కడ వసతులు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందడం ఖాయం. దీనికి తోడు దుకాణాలు, అల్పాహార శాలలు, ఇతరత్రా ఏర్పాటుచేసే ఆదాయం చేకూరుతుంది. సౌకర్యాలు కల్పిస్తే ఆదాయంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి సాధించడం ఖాయం.


ఆరోగ్యానికి దోహదం: భీంసింగ్‌, రైడర్‌
అటవీ మార్గం గుండా సైకిల్‌ ప్రయాణం ఆరోగ్యాన్ని పెంచుతుంది. తేలికైన, ఎంతో ఖరీదైన సైకిళ్లను వినియోగిస్తున్నాం. ముఖ్యంగా సెలవు దినాల్లో వీటిని చేపడుతున్నాం. అందరం కలిసి ఒకేసారి ప్రయాణం చేయడం మంచి అనుభూతిని పంచుతుంది. హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్‌ రద్దీ, కలుషితమైన గాలి, ఉరుకుల, పరుగుల జీవితంలో నుంచి ఇలా బయటకు వస్తే ఎంతో హాయిని కలిగిస్తోంది.


అనుకూలంగా ఉండటంతో..: రవీందర్‌రెడ్డి
నర్సాపూర్‌-హైదరాబాద్‌ మార్గం ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. మలుపుల్లో, వంకర్లు తిరుగుతూ వాహనాలను నడపడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అయితే రోడ్డు మధ్యలో విభాగిని ఉంటే రైడింగ్‌కు ఎంతో సురక్షితం. ఒక్కోసారి ఒక్కో మార్గాన్ని ఎంపిక చేసుకుంటాం. ఉదయాన్నే బయల్దేరి సాయంత్రం వరకు తిరిగి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని