కరిముఖ.. సెలవిక
eenadu telugu news
Published : 21/09/2021 02:13 IST

కరిముఖ.. సెలవిక

మహా నిమజ్జనం సంపూర్ణం

ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల ప్రత్యేక కార్యాచరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని నగరంలో గణేశ్‌ నిమజ్జనం ముగిసింది. ఆదివారమే.. 24గంటల్లో నిమజ్జనం పూర్తిచేయాలనుకున్నా.. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, పాతబస్తీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం ప్రభావంతో నిమజ్జన ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లోని చెరువుల్లో 40గంటల్లో 40వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా  పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేశారు. వర్షసూచన, విగ్రహాల నిమజ్జనం సంఖ్య ఆధారంగా పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో విగ్రహాలతో కూడిన లారీలను నిలిపేందుకు ప్రత్యేక స్థలం కేటాయించారు. పీపుల్స్‌ప్లాజా, ఎన్టీఆర్‌మార్గ్‌లో విగ్రహాల నిమజ్జనాలకు స్థలాన్ని కేటాయించి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ప్రక్రియను నిలిపేసి రెండువైపులా వాహనాల రాకపోకలను అనుమతించారు.ప్రజల సహకారం, అధికార యంత్రాంగం సమన్వయంతో గణేశ్‌ నిమజ్జనం విజయవంతంగా పూర్తి చేశామని పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్‌, మహేష్‌భగవత్‌, స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.


సమన్వయంతో సాధించారు!

దివేల మంది పారిశుద్ధ్య, ఎంటమాలజీ కార్మికులు, అధికారులు, ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేయడం వల్ల వేడుక విజయవంతమైందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ వెల్లడించారు. నగరవ్యాప్తంగా జరిగిన నిమజ్జన మహోత్సవాన్ని నిరంతరం ఆయన పర్యవేక్షించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హుస్సేన్‌సాగర్‌ వద్ద విగ్రహాలు బారులు తీరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలను అన్ని క్రేన్ల వద్దకు పంపించాలని, వేగంగా నిమజ్జనం పూర్తి చేసి రహదారులను శుభ్రం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరోవైపు నగరంలోని ఆయా నిమజ్జన కొలనులు, చెరువుల వద్ద ఎప్పటికప్పుడు వ్యర్థాలను తరలించారు. బల్దియా, హెచ్‌ఎండీఏ సిబ్బంది టన్నుల కొద్దీ నిమజ్జన వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించారు.
నారాయణగూడ: ఎన్టీఆర్‌ మార్గ్‌లో 1518, నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో 1622, ట్యాంక్‌బండ్‌పై 1930 గణేష్‌లు గంగమ్మ ఒడికి చేరినట్లు సైఫాబాద్‌ డీఐ రాజునాయక్‌ తెలిపారు.


రికార్డు స్థాయిలో విగ్రహాల నిమజ్జనం: డా.భగవంత్‌రావు

అబిడ్స్‌: ఈసారి రికార్డు స్థాయిలో దాదాపు 2 లక్షల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డా.భగవంత్‌రావు తెలిపారు. సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 42వ సామూహిక నిమజ్జన వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగినట్లు సోమవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాగర్‌లో నిమజ్జనానికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టుతో పాటు సీఎం కేసీఆర్‌, మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని