నమ్మించి.. పని ముగించి
eenadu telugu news
Updated : 21/09/2021 04:37 IST

నమ్మించి.. పని ముగించి

120 తులాల బంగారం, రూ.15 లక్షల నగదు చోరీ

రాయదుర్గం, న్యూస్‌టుడే: సైబరాబాద్‌ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో, రాయదుర్గం ఠాణా పరిధి టెలీకాంనగర్‌ కాలనీలో సోమవారం 120 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 లక్షలు అపహరించారు. 4 నెలల కిందట ఈ ఇంట్లో పనికి కుదిరిన నేపాలీ దంపతులపై బాధితులు అనుమానం వ్యక్తం చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. కాలానీలో వ్యాపారవేత్త బీరం గోవిందరావు(48), భార్య దీపతో కలిసి మొదటి అంతస్తులో ఉంటున్నారు. నేపాల్‌కు చెందిన లక్ష్మణ్‌(34), పవిత్ర(30) దంపతులు ఆ ఇంట్లో కాపలాదారులుగా చేరగా కింది గదిని కేటాయించారు. గోవిందరావు దంపతులు.. శనివారం ఉ. 11 గంటలకు శ్రీశైలం వెళ్లారు. ఆదివారం ఉ.10 గంటల ప్రాంతంలో లక్ష్మణ్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. రెండో అంతస్తులో అద్దెకుండే వారికి ఫోన్‌ చేసి.. లక్ష్మణ్‌తో మాట్లాడించాలని కోరారు. లేరని చెప్పడంతో వెంటనే బయలుదేరి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చారు. లాకర్‌లో పరిశీలించగా బంగారం, నగదు కనిపించ లేదు. దొంగ ముందుగా స్కూ డ్రైవరుతో కిటికి గ్రిల్స్‌ తొలగించి హాల్లోకి ప్రవేశించి.. ఆ తర్వాత గునపంతో పడక గది తాళాలు పగలగొట్టినట్లు గుర్తించారు.

విద్యుత్తు సరఫరా నిలిపేసి.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా శనివారం అర్ధరాత్రి 2 గంటలకు లక్ష్మణ్‌.. మొదటి అంతస్తుకొచ్చినట్లు కనిపించింది. ఆ వెంటనే ఆ ఒక్క పోర్షన్‌కు విద్యుత్తు సరఫరా నిలిపేశాడు. దీంతో సీసీ కెమెరాలు పనిచేయలేదు. లాకర్‌ తాళాలు కబ్‌ బోర్డు కింద ఉన్న డెస్క్‌లో ఉండటం కలిసొచ్చింది. పథకం ప్రకారమే దంపతులు పనిలో చేరినట్లు తేల్చారు. అంతకుముందు వాచ్‌మెన్‌గా పనిచేసిన యంలాల్‌.. వీరిని కుదిర్చాడు. వీరితోపాటు ఇంకెవరైనా చోరీలో పాల్గొన్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నిందితులు పటాన్‌చెరులో సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని