HYD: చీకటి పడ్డాకే అసలు కథ మొదలు
eenadu telugu news
Updated : 21/09/2021 06:55 IST

HYD: చీకటి పడ్డాకే అసలు కథ మొదలు

నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ల నిర్వహణ
కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: యువతకు అది మరో ప్రపంచం. ఆరు రోజులు అలసి ఏడో రోజు అక్కడ వాలిపోతారు. చీకటిపడ్డాకే అక్కడ అసలు కథ మొదలవుతుంది. మసక చీకట్లో, చెవులు చిల్లులు పడే డీజేలతో, రంగు రంగుల పానీయాలతో ఆ హడావుడే వేరు. ఆ మరో ప్రపంచమే పబ్‌.. ఇది కొందరికి ఉల్లాసాన్నిస్తే, మరికొందరికి వ్యసనంగా మారుతోంది. ఈ వ్యసనాన్ని నగదు చేసేందుకు కొందరు పబ్‌ నిర్వాహకుల నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పబ్‌లను నిర్వహించుకోవచ్చని నిబంధనలతో అనుమతులిస్తే కొందరు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని పబ్‌లలో ‘రెంట్‌ ఎ గర్ల్‌’ పేరుతో కొత్త దందాకు తెరతీసి గంటకు రెండు నుంచి మూడు వేలు ఇస్తే చాలు అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి పబ్‌లపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భాలు అనేకం. తాజాగా ఇదే కోవకు చెందిన బేగంపేట్‌ కంట్రీ క్లబ్‌ ఆవరణలో నిర్వహిస్తున్న మూడు పబ్‌లను రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్‌ చేశారు. అర్ధరాత్రి దాటినా పబ్‌లను నిర్వహిస్తూ న్యూసెన్స్‌ చేస్తున్నారనే స్థానికుల ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మూడు పబ్‌లు సీఎం క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం.

మత్తులో ముంచుతూ..
అధికారులు హెచ్చరిస్తున్నా పబ్‌ల నిర్వహణ తీరులో మార్పు ఉండటం లేదు. అర్ధరాత్రి దాటినా వినియోగదారులకు మద్యం సరఫరా చేస్తూ వారిని మత్తులో ముంచుతున్నారు. దీంతో ఇలాంటి వారు ఇష్టారీతిన డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. యువతీ, యువకులే కాదు కుటుంబాల్లోకి కూడా ఈ సంస్కృతి చొచ్చుకుపోయింది. తాజాగా గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్‌ పబ్‌కు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఓ చిన్నారిని తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. విద్యుద్దీప కాంతుల్లో.. ఉల్లాసాన్ని నింపే సంగీతంలో.. అందరూ ఊగిపోయారు. ఒళ్లు మరిచి చిందులేశారు. చిన్నారితో డ్యాన్స్‌.. డ్యాన్స్‌ అంటూ స్టెప్పులేయించారు. ఈ విషయం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ పబ్‌కు నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు. నగరంలో సుమారు 40కి పైగా పబ్‌లు ఉన్నాయి. వీటిల్లో ఒక్కో పబ్‌ 100 నుంచి 500 మంది సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు. ఇంత మంది గుమిగూడే ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.


12 కేసులు

బేగంపేట్‌లోని కంట్రీ క్లబ్‌ ఆవరణలో నిర్వహించే పబ్‌లపై ఇప్పటి వరకు 15 కేసులు నమోదయ్యాయి. సమయానికి మించి పబ్‌ నిర్వహించడం, అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే తదితర ఆరోపణలున్నాయి. ఇటీవలే ఇక్కడి హైఫై పబ్‌లో తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి సీసీ ఫుటేజీ కావాలని అడిగిన యువతిపై పబ్‌ సిబ్బంది దాడికి దిగడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా కంట్రీ క్లబ్‌ ఆవరణలోని క్లబ్‌ హాలీవుడ్‌, హైఫై, పర్పుల్‌లను అధికారులు సీజ్‌ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉన్న ఈ పబ్‌లపై స్థానికులు కొంతకాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.


నిర్వహణ.. ఉల్లంఘన

కొవిడ్‌ నిబంధనలు సడలించిన ప్రభుత్వం పబ్‌లు తెరవడానికి అనుమతి ఇచ్చింది. అదే సమయంలో కచ్చితంగా కొన్నింటిని పాటించాలంటూ నిర్వాహకులను ఆదేశించింది. పబ్‌ లోపలికి రావాలంటే మాస్క్‌ తప్పనిసరి చేశారు. సామాజిక దూరం పాటించాలి. వెయిటర్లు, ఇతర సిబ్బంది తప్పక మాస్క్‌లు ధరించాలి. డాన్స్‌ ఫ్లోర్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీటిని పాటిస్తూ పబ్‌లకు తెరుచుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ల నిర్వహణ సాగుతోంది. వీటిని ఉల్లంఘించినందున ఇటీవలే ఫిలింనగర్‌లోని సంచూరి పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని