‘భోంచేద్దాం’ రండి
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

‘భోంచేద్దాం’ రండి

ఉపకమిషనర్ల బదిలీలపై హోటల్లో బేరసారాలు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలోని సర్కిళ్ల ఉపకమిషనర్ల బదిలీల ప్రక్రియను కొందరు ముడుపుల వ్యవహారంగా మార్చారు. ఏ సర్కిల్‌కు బదిలీ కావాలో కోరుకోండంటూ శేరిలింగంపల్లి జోన్‌కు చెందిన సీనియర్‌ ఇంజినీరు ఆధ్వర్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన రహస్య సమావేశమే అందుకు నిదర్శనం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రహస్య సమావేశానికి పురపాలకశాఖకు చెందిన ఉన్నతాధికారికి సన్నిహితులైన 12 నుంచి 15 మంది ప్రస్తుత ఉపకమిషనర్లు హాజరయ్యారు. గణపతి నిమజ్జన కార్యక్రమం నడుస్తుండగా.. అందరూ మధ్యాహ్న భోజనం పేరుతో అక్కడ కలుసుకున్నారు. నాయకత్వ హోదాలో సీనియర్‌ ఇంజినీరు మాట్లాడారు. త్వరలో ఉపకమిషనర్ల బదిలీలు ఉన్నాయని, ఎవరికి ఏ సర్కిల్‌ కావాలో తేల్చుకోవాలని, సర్కిల్‌ను బట్టి డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉపకమిషనర్‌ పదవికి వేలం పాట జరిగింది. శేరిలింగంపల్లి జోన్‌లోని సర్కిళ్లకు ఎక్కువ డబ్బు ఇచ్చేందుకు కొందరు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.  దీనిపై ఇతర ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు..పనిమంతులకు గుర్తింపు ఇచ్చారని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో గుర్తుచేసుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని