వేగంగా సహకారం.. క్షణాల్లో మోసం
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

వేగంగా సహకారం.. క్షణాల్లో మోసం

బిల్లుల చెల్లింపు పేరుతో రూ.లక్షల్లో నగదు బదిలీ
సైబర్‌ నేరస్థుల కొత్త తరహా మాయాజాలం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘సైదాబాద్‌లో నివాసముంటున్న విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌కు సోమవారం ఉదయం ఒక ఫోన్‌ వచ్చింది... మీరు కరెంట్‌ బిల్లు చెల్లించలేదంటూ సైబర్‌ నేరస్థుడు ఫోన్‌ చేశాడు. బిల్లు కట్టేశానంటూ ఆయన బదులివ్వగా.. అయితే, వివరాలు అప్‌డేట్‌ కాలేదంటూ నిందితుడు ఆయనతో విద్యుత్‌శాఖ మొబైల్‌యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాడు. ఆనక క్విక్‌ సపోర్ట్‌(వేగంగా సహకారం) యాప్‌నూ డౌన్‌లోడ్‌ చేసుకోండి అని సూచించాడు. ఆపై తొలుత రూ. పది చెల్లించాలని చెప్పగా... విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ అంగీకరించాడు. తర్వాత తన ఫోన్‌కు వచ్చిన ఓటీపి వివరాలను అతడితో పంచుకోగానే.. కొద్ది నిముషాల్లోనే ఆయన బ్యాంక్‌ ఖాతాల్లోంచి రూ.5.82 లక్షలు వేర్వేరు బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ అయ్యాయి.’’

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు సారాంశమిది. ఇలా మోసపోయింది ఒకరే కాదు... వందల సంఖ్యలో బాధితులు సైబర్‌ నేరస్థుల బారిన పడి రూ.లక్షలు నష్టపోతున్నారు. ఇదంతా కేవలం క్విక్‌ సపోర్ట్‌ మొబైల్‌యాప్‌ వల్లే. దాని దుష్పరిమాణాలు గ్రహించే రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ యాప్‌ను వినియోగించొద్దంటూ కొద్ది నెలల క్రితమే హెచ్చరించింది.

వాటికి దూరంగా ఉండండి..
బ్యాంకులతో ప్రమేయం లేకుండా అంతర్జాల ఆధారిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు బ్యాంకులు చరవాణి ద్వారా యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాటితోపాటు పేటీఎమ్‌, పేయూ, ఫోన్‌పే వంటి ఈ-వ్యాలెట్‌లు సంబంధిత సేవలను అందిస్తున్నాయి. సైబర్‌ నేరస్థులు మరింత సులువుగా బాధితుల నుంచి నగదు బదిలీకి క్విక్‌ సపోర్ట్‌, ఎనీ డెస్క్‌ యాప్‌లను వారే రూపొందించారు. ఈ రెండు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఇక వారి చేతుల్లో మన బ్యాంక్‌ ఖాతాల వివరాలు ఉన్నట్లే.. అందుకే సైబర్‌ నేరస్థులు బాధితులకు ఫోన్‌ చేసి మరీ ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసువాల్సిందిగా సూచిస్తున్నారు.

వ్యక్తిగత సమాచారం సైతం..
క్విక్‌సపోర్ట్‌ యాప్‌తో కేవలం డబ్బే కాదు... వ్యక్తిగత సమాచారమంతా నేరస్థుడి ఫోన్‌లోకి వెళ్తుందని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. బాధితుడి స్నేహితులు, కుటుంబీకుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఓటీపీలతో పాటు ఫొటోలు, వీడియోలూ నేరస్థుడి చేతుల్లోకి వెళ్తాయి. చరవాణిలో మనం చేసే పనులన్నీ సైబర్‌ నేరస్థుడు ఎక్కడో ఉండి ప్రత్యక్షంగా చూస్తుంటాడని వివరిస్తున్నారు. అందుకే చరవాణుల్లో బ్యాంకుల యాప్‌లున్న వినియోగదారులు వెంటనే క్విక్‌సపోర్ట్‌, ఎనీడెస్క్‌ యాప్‌లను తొలగించాలని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. టెలిఫోన్‌, కరెంట్‌ బిల్లులు, డెబిట్‌కార్డ్‌ అప్‌డేట్‌ అంటూ ఫోన్లు వస్తే.. స్పందించొద్దని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని