అర్ధరాత్రి ఆరుబయట అవస్థలు
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

అర్ధరాత్రి ఆరుబయట అవస్థలు

స్టేషన్లోకి అనుమతించని రైల్వే అధికారులు

సికింద్రాబాద్‌ స్టేషన్‌ బయట పడుకున్న ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌: రైలు ప్రయాణికులు అర్ధరాత్రి పూట నానా అవస్థలు పడుతున్నారు. పగలంతా జనరల్‌ వెయిటింగ్‌ హాలులోకి అనుమతించిన ద.మ. రైల్వే అధికారులు రాత్రి 11 దాటిన తర్వాత ఎవరినీ అనుమతించడంలేదు. సాధారణ టిక్కెట్‌తోపాటు రిజర్వేషన్‌ టిక్కెట్‌ ఉన్నా బయటకు పంపేస్తున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు స్టేషన్‌ ఆరుబయటే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. నగరం నుంచి రాకపోకలు సాగించే 245 రైళ్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రీపెయిడ్‌ విశ్రాంతి గదుల్లో ఉంటే ఉండాలి.. లేదంటే స్టేషన్‌ బయటే అన్నట్లు నగరంలోని స్టేషన్ల పరిస్థితి తయారైంది.

శుభ్రం చేసేందుకని..
కరోనా కారణంగా చాలా రైళ్లు రద్దయ్యాయి. మూడు స్టేషన్ల నుంచి దాదాపు 245 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.80లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఏసీ బోగీల ప్రయాణికులు మినహాయిస్తే.. స్లీపర్‌క్లాస్‌, సాధారణ ప్రయాణికులు దాదాపు 1.20లక్షల మంది ఉంటారు. వీరు స్టేషన్‌కు గంటనుంచి 2 గంటల ముందే చేరుకుంటారు. వేకువజాము రైళ్లకోసం రాత్రి 10 దాటితే ప్రజారవాణా ఉండదని ఈలోపే స్టేషన్‌కు వేల మంది చేరుకుంటారు. వీరంతా జనరల్‌ వెయిటింగ్‌హాళ్లలో, ప్లాట్‌ఫాంల మీద వేచి ఉండేవారు. గంట ముందే స్టేషన్లోకి అనుమతించడంతో వేలాది మంది బయటే ఉండాల్సిన పరిస్థితి. రాత్రి 11 దాటితే ప్లాట్‌ఫాంల మీదకు, జనరల్‌ వెయిటింగ్‌ హాలులోకి అనుమతించడం లేదు. దీంతో ఆరుబయటే ఉండాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే అధికారులు మాత్రం జనరల్‌ వెయిటింగ్‌ హాలును శుభ్రం చేసేందుకు రాత్రి 12 నుంచి వేకువజాము 3వరకు ఖాళీ చేయిస్తామంటున్నారు. రాత్రి 10.30 నుంచే అక్కడ ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ప్రయాణికులను వెళ్లగొడుతున్నారు.

వేకువజామున 4 గంటల వరకూ అనుమతించని పరిస్థితి.
గతంలో జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారు.. స్టేషన్‌ ఆవరణలోనే మధ్యాహ్నం వచ్చే రైలుకోసం బారులుతీరేవారు. ఒక్కోసారి స్టేషన్లో రద్దీ ఉంటే బయట వరుసలో నిలబడేవారు. ఇప్పుడు బయోమెట్రిక్‌ టోకెన్‌ విధానంతో ప్రయాణికులకు ఆ వెసులుబాటు పోయింది. ముందు ఎప్పుడైనా వచ్చి.. మీ టిక్కెట్‌ చూపించి వేలుముద్రలు ఇచ్చి.. టోకెన్‌ తీసుకుని రైలు బయలుదేరే సమయానికి 15 నిమిషాల ముందు వస్తే చాలు అని సూచించింది. టోకెన్‌ తీసుకోవడానికోసారి.. రైలు ఎక్కడానికోసారి వచ్చే పరిస్థితులు సాధారణ ప్రయాణికులకు లేదు. దీంతో టోకెన్‌ తీసుకుని బయటే ఉండాల్సిన పరిస్థితి. టోకెన్‌ ఆధారంగా జనరల్‌బోగీలోకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని