అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

అత్యాచార నిందితుడికి పదేళ్ల జైలు

రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం

నిందితుడు రాజు

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఓ బాలికను అపహరించుకుపోయి భయభ్రాంతులకు గురి చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతో పాటు బాధితురాలికి రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని నిందితుడిని ఆదేశిస్తూ రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి తిరుపతి మంగళవారం తీర్పు వెలువరించారు. జిల్లా కోర్టుల ఆవరణలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంగర రాజిరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా ధారుర్‌ మండలం గురుదొడ్ల గ్రామానికి చెందిన కావలి రాజు(30) ఓ దినసరి కూలీ. రాజు 2013లో కొన్నాళ్లు ముంబయి నగరానికి వెళ్లి దాదర్‌ ప్రాంతంలో కూలీ పనిచేసి తిరిగి సొంతూరు వచ్చి ఆటో నడిపించాడు. 2013 జూన్‌లో అదే మండలంలోని ధారుర్‌ మండలంలోని ఓ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే బాలిక(15) గ్రామ శివారు నుంచి ఒంటరిగా నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుండడం గమనించాడు. ఆటోలో పాఠశాల వద్ద దింపుతానని నమ్మించి ఎక్కడా ఆపకుండా తాండూరు రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లాడు. బాలికను భయపెట్టి అక్కడి నుంచి రైల్లో నేరుగా ముంబయిలోని దాదర్‌ తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం తిరిగి ధారుర్‌ మండల కేంద్రానికి తీసుకొచ్చి వదిలేసి పరారయ్యాడు. బాలిక సొంత గ్రామానికి చేరుకొని కుటుంబసభ్యులతో కలిసి ధారుర్‌ ఠాణాకు వెళ్లి విషయాన్ని పోలీసులకు వివరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారంలోపే నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పూర్తి దర్యాప్తు తర్వాత నిందితుడిపై కోర్టులో సమగ్రమైన ఆధారాలతో కూడిన అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన కోర్టు అపహరణ నేరానికి మూడేళ్ల జైలు, పోక్సో చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష విధించి రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని