గిరిపోషణ.. ఆరోగ్య రక్షణ
eenadu telugu news
Published : 22/09/2021 00:38 IST

గిరిపోషణ.. ఆరోగ్య రక్షణ

 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం 

ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్న సర్కారు

అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కల్పిస్తున్న సమన్వయ కర్తలు

న్యూస్‌టుడే, పరిగి: దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్న చెంచుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారిని శారీరకంగా, మానసికంగా, ఆరోగ్య పరంగానూ మెరుగు పరచాలని సంకల్పించింది. నిరక్షరాస్యత, అమాయకత్వం కారణంగా వారి పిల్లల్లోనూ ఎదుగుదల లోపం గుర్తించింది. ‘గిరిపోషణ’ ద్వారా గర్భిణులు, తల్లులు, పిల్లలతో పాటు కిశోర బాలికలకు పోషకాహారాన్ని అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేయాలని తలంచింది. రాష్ట్రంలో తొలిదశలో ఇతర జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రభుత్వం మెరుగైన ఫలితాలు రావడంతో మూడో దశలో పది జిల్లాలను ఎంపిక చేసింది. అందులో వికారాబాద్‌ జిల్లాకు అవకాశం కల్పించడంతో చెంచుల ఆరోగ్య స్థితిగతులు బాగు పడేందుకు చక్కటి అవకాశం కలిగినట్లయింది. రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ, మహిళా,శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఇక్రిశాట్‌ సహకారంతో అమలుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది.
తాండూరు, వికారాబాద్‌, పరిగి, మర్పల్లి, కొడంగల్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 969 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు 138 మినీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 232 మంది చిన్నారులు  పోషణ లోపంతో బాధపడుతున్నారు. గిరిపోషణ ఆధ్వర్యంలో జిల్లాలో 24కేంద్రాలు ఎంపికయ్యాయి. వాటి పరిధిలో 3-5ఏళ్లలోపు 402 బాల బాలికలు ఉండగా అందులో 190 మంది చెంచులు ఉన్నారు. కిశోర బాలికలు 675 మంది ఉండగా చెంచులు 374, గర్భిణులు 140 మందిలో చెంచులు 74 మంది, తల్లులు 144 మందిలో 58 మంది చెంచులు ఉన్నారు. మొత్తంగా 2,101 మంది దీని కింద లబ్ధిపొందనున్నారు.
కరోనాతో ఇక్కట్లు: జిల్లాలో చెంచుల పరిస్థితి దయనీయంగా మారింది. దీనికి తోడు కరోనా కారణంగా ఉపాధి అవకాశాలు లేకుండా పోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాటి పరిస్థితుల్లో వారి ఆరోగ్య పరిరక్షణ దైవాదీనంగా మారింది. ముందుగానే ఆరోగ్యపరమైన సమస్యలను దరిచేరనీయకుండా ఉండేందుకు దూరదృష్టిని సారించింది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం కింద అందుతున్న పోషకాహారానికి తోడు అనుబంధంగా అదనంగా ఉదయం 9గంటలకు అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ను అందజేయనున్నారు. మొదట్లో కేవలం చెంచులకే పంపిణీ చేయాలని అనుకున్నా విమర్శలు వస్తాయని భావించి చివరకు ఆయా కేంద్రాల పరిధిలో ఉన్నవారందరికీ వర్తింపజేయాలని నిర్ణయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 3-5ఏళ్లలోపు పిల్లలు ఎదుగుదలకు ఎంతగానో ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ప్రతిరోజూ చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనం, పల్లి పట్టీలు, నువ్వులతో తయారు చేసిన ఉండలు, పుట్నాలు, శనగలు, బెల్లంతో తయారు చేసిన వాటిని అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. నవంబరు 5వ తేదీ అనంతరం ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎక్కడెక్కడ అమలు చేస్తారంటే: పూడూరు మండలం సోమన్‌గుర్తి, వికారాబాద్‌ మున్సిపాలిటీ, చెంచుపల్లి, బొంరాస్‌పేట మండలం వడిచర్ల, దోమ మండలం మోత్కూరు, చంద్రగుట్ట, పరిగి మండలం గడిసింగాపూర్‌, కుల్కచర్ల మండలం అనంతసాగర్‌, అంతారం, బండవెల్కిచర్ల, చాపలగూడెం, చెల్లాపూర్‌, కుస్మసముద్రం, బొంరెడ్డిపల్లి, పీరంపల్లి, రాంరెడ్డిపల్లి, రాంపూర్‌, సాల్వీడ్‌, బొంరెడ్డిపల్లి, బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌, పెద్దేముల్‌ మండలం చైతన్యనగర్‌ కేంద్రాల్లో గిరిపోషణ అమలు కానుంది.
ఎంతో మేలు: లలితకుమారి, మహిళ, శిశుసంక్షేమాధికారిణి
కేంద్రాల ద్వారా అదనంగా పౌష్టికాహారాన్ని అందించడం పేదలకు వరం. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా కేంద్రానికి పంపేలా సహకరించాలి. చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం పంపిణీ పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
సమర్థంగా అమలు చేస్తాం: కొటాజీ, జిల్లా గిరిజన సంక్షేమాధికారి
ఇరు శాఖల సమన్వయంతో సమర్థంగా అమలు చేస్తాం. మూడో దశలో వికారాబాద్‌ జిల్లాకు అవకాశం దక్కడం మంచి పరిణామం. జిల్లాలో 740 కుటుంబాల పరిధిలో 2,554 మంది చెంచులు ఉన్నారు. గిరిపోషణతో 696 చెంచులు, 1361 మంది ఇతరులకు, 44 మంది ఎస్టీలకు లబ్ధి చేకూరనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని