ఈ-సైకిల్‌ రయ్ రయ్
eenadu telugu news
Published : 22/09/2021 06:00 IST

ఈ-సైకిల్‌ రయ్ రయ్

 ఎలక్ట్రిక్‌ మొబిలిటీ వైపు యువత మొగ్గు

ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయ ఉద్యోగి రాము. తమ్ముడు తయారు చేసిన ఎలక్ట్రిక్‌ సైకిల్‌పై ఎన్టీఆర్‌ మార్గ్‌లో సవారీ చేస్తున్నారు. అదే కార్యాలయంలో ఆయన తమ్ముడు సాయి కుమార్‌ పనిచేస్తున్నారు. వీరి ఇల్లు పంజాగుట్టలో. ఇంటి నుంచి కార్యాలయానికి, మళ్లీ ఇంటికి 4 కి.మీ. దూరం. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన నేపథ్యం కావడంతో ఇంట్లోనే బ్యాటరీ సైకిల్‌ను తయారు చేశారు సాయికుమార్‌. అప్పటికే సైకిల్‌ ఉండటంతో ఆన్‌లైన్‌లో విద్యుత్తు సైకిల్‌కు కావాల్సిన బ్యాటరీ, మోటార్‌ వంటివి కొనుగోలు చేసి తనే బ్యాటరీ సైకిల్‌గా మార్చారు. ‘ఛార్జింగ్‌కు 4 గంటలు పడుతుంది. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 20 కి.మీ. వరకు వస్తుంది. దాదాపు రూ.10 వేల వ్యయం అయింద’ని సాయికుమార్‌ తెలిపారు.


సాధారణ సైకిల్‌నే..

నగరంలో సైక్లింగ్‌కు ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉన్నా.. ఔత్సాహికులు మాత్రం హుషారుగా సైకిల్‌పై సాగుతున్నారు. మార్కెట్లో పలు కంపెనీలు, అంకుర సంస్థలు ఎలక్ట్రిక్‌ సైకిళ్లను విక్రయిస్తుండగా యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. కొత్త ఎలక్ట్రిక్‌ సైకిల్‌ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఉన్నదానికే బ్యాటరీ జోడించి ఈ-సైకిల్‌గా మారుస్తున్నారు. సాధారణ సైకిల్‌ను ఇలా మార్చుకునే పరికరాలన్నీ కలిపి ఏడు వేల లోపే ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి.


ఉపయోగం ఇలా..

ఈ-సైకిల్‌ను పలు విధాలుగా వాడుకోవచ్చు. సాధారణ సైకిల్‌ మాదిరిగా తొక్కవచ్చు. పూర్తిగా బ్యాటరీపైనే వెళ్లొచ్చు. మరింత వేగంగా వెళ్లాలి? ఒంట్లో క్యాలరీలు కరగాలంటే తొక్కుతూ యాక్సిలేటర్‌ ఇస్తూ వెళ్లొచ్చు. క్రూయిజ్‌ నియంత్రణ వ్యవస్థ కూడా ఈ-సైకిల్స్‌లో ప్రవేశపెడుతున్నారు. కావాల్సిన మోడ్‌లోకి మార్చుకుంటూ రైడ్‌ చేయవచ్చు. సైకిల్‌ పైభాగంలో డిస్‌ప్లే ఉంటుంది. రాత్రిపూట అనువుగా లైటింగ్‌ ఉంటుంది. వీటికి లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ అవసరం ఉండదు.


ప్రణాళికల అమలు తీరిలా..

నగరంలో దాదాపు 450కి.మీ.ల మేర సైక్లింగ్‌ ట్రాకులు నిర్మించే అవకాశం ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంటీఏ కలిసి పలు పాంతాల్లో ట్రాక్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాయి. మొదట బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు రోడ్డు, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌(నెక్లెస్‌రోడ్డు), కూకట్‌పల్లి ప్రాంతాల్లో మాత్రమే ట్రాకులు నిర్మితమయ్యాయి. అవీ ఇప్పుడు వాహనాల పార్కింగ్‌ స్థలాలుగా మారిపోగా.. కొన్ని చోట్ల వాహనాలే నడుపుతున్నారు.

వాహనదారుల్లో చైతన్యంతోనే..  -దినేష్‌, హ్యాపీ హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌

ఇప్పటికే ఉన్న సైక్లింగ్‌ ట్రాకుల్ని వాహనాల పార్కింగ్‌కు వాడుతున్నారు. వీటిపై ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టి వాహనదారుల్లోనూ అవగాహన కల్పించాలి. నగరంలో రద్దీ తక్కువున్న రోడ్లు, నిర్మించే వీలున్న ప్రతి చోటా ట్రాకులు నిర్మించాలి.


ఆసక్తిగా వచ్చి టెస్ట్‌ రైడ్‌

కోల్‌కతా కేంద్రంగా ఏర్పాటైన కంపెనీ మాది. భారత్‌లోనే మొదటి స్మార్ట్‌ ఈ-సైకిల్‌ మాది. యాప్‌ ఆధారంగా ఎప్పటికప్పుడు పనితీరు తెలుసుకోవచ్చు. హైదరాబాద్‌లో వేర్వేరు చోట్ల ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనలో ఆసక్తిగా వచ్చి టెస్ట్‌ రైడ్‌ చేస్తున్నారు. బుకింగ్స్‌ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మూడు గంటల్లో పూర్తి ఛార్జింగ్‌ అవుతుంది. మూడేళ్ల వరకు వారంటీ ఉంది.

   - కృష్ణ, మోటోవొల్ట్‌

- ఈనాడు డిజిటల్‌, ఈనాడు, హైదరాబాద్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని