‘తెలంగాణలో 12 శాతం ఉన్న మాదిగలకు అన్యాయం’
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

‘తెలంగాణలో 12 శాతం ఉన్న మాదిగలకు అన్యాయం’


మంద కృష్ణమాదిగను పరామర్శిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్‌

అంబర్‌పేట, విద్యానగర్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో 12 శాతం ఉన్న మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 64 లక్షల మంది దళితులు అంటే 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు కింద రూ. 1.70 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇటీవల దిల్లీలో కాలికి శస్త్ర చికిత్స అనంతరం అంబర్‌పేట డీడీ కాలనీలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావుతో కలిసి మంగళవారం ఆయన పరామర్శించిన తర్వాత మాట్లాడారు. రాష్ట్రంలోని దళితులందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుందన్నారు. దళితులను అన్ని రకాలుగా మోసగించారనే విషయంపై మందకృష్ణతో చర్చించినట్లు చెప్పారు. మూడెకరాల భూ పంపిణీ, ముఖ్యమంత్రి పదవి, రెండు పడక గదుల ఇళ్లు తదితర విషయాల్లో కేసీఆర్‌ దళితులను మోసగించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మాదిగలు అతి పెద్ద సామాజిక వర్గమని, 50 లక్షల మంది ఉన్నప్పటికీ మంత్రివర్గంలో ఒక్కరికీ కూడా అవకాశం కల్పించకుండా తెరాస ప్రభుత్వం అవమానించిందని ధ్వజమెత్తారు. 74 ఏళ్ల చరిత్రలో పంజాబ్‌లో మొదటిసారిగా దళిత ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి దక్కిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలకు న్యాయం చేయాలని, వారి రాజకీయ సాధికారతకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని