శవాలపై కాసుల వేట
eenadu telugu news
Published : 22/09/2021 06:00 IST

శవాలపై కాసుల వేట

జీహెచ్‌ంఎసీలో కొవిడ్‌ మృతదేహాల తరలింపు, దహనంలో అవినీతి

ఈనాడు, హైదరాబాద్‌: శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: కొవిడ్‌ ప్రపంచానికి మాత్రమే మహమ్మారి. జీహెచ్‌ఎంసీలోని పలువురు అధికారులకు అదో బంగారు బాతు అయింది. నగరవ్యాప్తంగా చోటు చేసుకున్న కొవిడ్‌ మరణాలు, మృతదేహాల తరలింపు, దహనం వంటి బాధ్యతలను శేరిలింగంపల్లి జోన్‌ ఉన్నతాధికారికి అప్పగించడంతో.. ఆ జోన్‌లోని కొందరు ఇంజినీర్లది అందులో ప్రధాన వాటా అయింది. జీహెచ్‌ఎంసీలోని ఆరు సర్కిళ్ల పరిధిలో రూ.18కోట్ల మేర ఖర్చయితే.. ఒక్క శేరిలింగంపల్లి జోన్‌లో రూ.10 కోట్ల బిల్లులు ఆమోదం పొందాయి. అక్కడి కొంతమంది ఇంజినీర్లు, ఆరోగ్య విభాగం అధికారులు గుత్తేదారులతో చేతులు కలిపి అవినీతి బాగోతం నడిపించారన్న ఆరోపణలొస్తున్నాయి. వరంగల్‌ మహానగరపాలక సంస్థ రూ.8 లక్షలకు కొనుగోలు చేసిన దహన వాటికను.. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు రూ.24 లక్షలు పెట్టి కొనడం, ఆ తరహా కేంద్రాలు నగరవ్యాప్తంగా పది చోట్ల ఏర్పాటవడం వంటి ఉదాహరణలే అందుకు నిదర్శనం.

ఒక్క సంస్థనే ఎంపిక చేసి..

2020 ఆగస్టు, సెప్టెంబరు సమయంలో కొవిడ్‌ మృతదేహాల యాజమాన్యం కోసం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ను నోడల్‌ అధికారిగా నియమించారు. ఆయన జోన్‌లోని రవాణా విభాగం ఇంజినీర్ల పనులు నిర్వహించే వారికి బాధ్యత ఇచ్చారు. అక్కడి నుంచి నిధుల దోపిడీ మొదలైంది. అంబులెన్సులు, మృతదేహాలకు తొడిగే జిప్‌ కవర్లు, సిబ్బంది ఉపయోగించే పీపీఈ కిట్లు, శానిటైజర్ల సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ ఏడాది పొడవునా ఒకే గుత్తేదారును ఎంపిక చేసుకుంది. వర్టికల్‌ ఏజెన్సీ సంస్థకే అక్టోబరు, 2020 నుంచి మార్చి, 2021 వరకు ఇంజినీర్లు రూ.1.77కోట్ల బిల్లులు చెల్లించడం గమనార్హం. అందులో మెజార్టీ పనులు టెండరుతో పని లేకుండా ఇచ్చినవే. దానిపై వివరణ కోరగా.. టెండర్ల ద్వారానే ఇచ్చామని సూపరింటెండెంట్‌ ఇంజినీరు చిన్నారెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని