ఆ డబ్బు.. తిరిగిచ్చేది లేదు!
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

ఆ డబ్బు.. తిరిగిచ్చేది లేదు!

 జల మండలి తాజా నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌, చందానగర్‌, న్యూస్‌టుడే:  తొలుత ఉచిత మంచినీటి పథకానికి విధించిన గడువు ముగిసిన అనంతరం ఈ ఏడాది మే నెలలో నీటి బిల్లుల కింద నల్లాదారులు చెల్లించిన మొత్తాలను తిరిగి ఇవ్వడం కుదరదని జలమండలి స్పష్టం చేసింది. గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పథకం గతేడాది డిసెంబరు నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత నల్లాదారు ఖాతా నెంబరు(క్యాన్‌)తో ఆధార్‌ అనుసంధానికి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. దీంతో 3.5 లక్షల మంది అనుసంధానం చేసుకున్నారు. వీరిని మినహాయించి మిగతా 7.5 లక్షల మందికి ఏడాది మే నెలలో జలమండలి నల్లా బిల్లులు జారీ చేసింది. దీంతో అప్పటివరకు పేరుకుపోయిన 5 నెలల బిల్లులను చాలామంది చెల్లించారు. కొందరు ఏకంగా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు బకాయిల మొత్తాలను కట్టారు. ఇలాంటి వారు లక్ష మందిపైనే ఉంటారనేది అంచనా. ఇంతలో మళ్లీ ఉచిత పథకానికి గడువును ఆగస్టు 15 వరకు ప్రభుత్వం పొడిగించింది. దీంతో మరో 3 లక్షల మంది వరకు కొత్తగా అనుసంధానం చేసుకున్నారు. అంతకుముందు జలమండలికి చెల్లించిన 5 నెలల బిల్లులను తమకు తిరిగి ఇచ్చేయాలని పలువురు వినియోగదారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా జల మండలి స్పష్టత ఇచ్చింది. భవిష్యత్తులో ఆయా వినియోగదారులు నిర్ణీత ఉచిత నీళ్లు 20 వేల లీటర్ల కంటే ఎక్కువ వాడుకుంటే.. ఆ అదనపు ఛార్జీలను ఇందులో సర్దుబాటు చేస్తామని ఓ అధికారి తెలిపారు. గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పథకానికి 10 లక్షల మంది నల్లాదారులు అర్హులు కాగా.. ఇప్పటి వరకు 6 లక్షల మంది ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. ఆగస్టు తరువాత బిల్లులను కూడా జారీచేయలేదు.  మరోసారి గడువు ముగియడంతో ఈ నెలాఖరులో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని