రానున్న నిధులు.. తీరనున్న వెతలు
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

రానున్న నిధులు.. తీరనున్న వెతలు

పంచాయతీలకు సొంత భవనాలు

రూ.47 కోట్లతో ప్రతిపాదనలు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: న్యూస్‌టుడే, వికారాబాద్‌ గ్రామీణ

పులుసుమామిడిలో సగంలోనే..

ల్లెల అభ్యున్నతికి, పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. 500పైగా జనాభా ఉన్న గ్రామాలను ఈ విధంగా మార్చారు. సర్పంచి, పాలకవర్గం ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా సమావేశాల నిర్వహణకు భవనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో నేటికీ రచ్చబండ, దేవాలయాలు, ఇతర భవనాల్లోనే కొనసాగించే పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. వీరి ఇబ్బందులను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి. సొంత భవనాలు లేని గ్రామాల వివరాలు సేకరిస్తున్నారు. ఉపాధిహామీ నుంచి నిధులను కేటాయించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో 566 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో రెండేళ్ల కిందట ఏర్పాటైన కొత్త పంచాయతీలు 199 ఉండగా, మిగతా 367 పంచాయతీలు గతం నుంచి కొనసాగుతున్నవే. నాలుగేళ్ల కిందట పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలని సర్కారు తలంచింది. అప్పట్లో ఉపాధి హామీ నిధులను (మెటీరియల్‌ కాంపొనెంట్‌) మంజూరు చేశారు. ప్రస్తుతం మరో మారు ఇదే తీరున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మండలాల వారీగా అభివృద్ధి అధికారుల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. పంచాయతీకి సొంత భవనం ఉందా లేదా, నూతన భవనం నిర్మించాలంటే అనువైన స్థలం అందుబాటులో ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో 297 నిలువ నీడలేదు. దాదాపు 180 వరకు చిన్న పంచాయతీలు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. వీటికి అద్దె చెల్లించడం భారంగానే మారుతోంది. దీంతో కొంత మంది సర్పంచులు సొంత భవనాలను పంచాయతీ కార్యాలయాలకు కేటాయించి, అద్దె తీసుకోకుండా పరిపాలనా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. వికారాబాద్‌ మండలం పులుసుమామిడి పంచాయతీ భవనం స్లాబు వేసి వదిలేశారు. వికారాబాద్‌ మండలం బురాన్‌పల్లిలో సర్పంచి తమ ఇంటిలోనే ఒక గదిని కేటాయించారు. ప్రస్తుతం 297 గ్రామాల్లో భవనాల నిర్మాణానికి రూ.47 కోట్లు, గతంలో మంజూరయిన వాటికి రూ.16 లక్షలు అవసమరమని ప్రతిపాదనలు రూపొందించారు. ఇవి ఉపాధి ద్వారా సమకూరే అవకాశం ఉంది.

ఎర్రవల్లి గ్రామంలో ఇలా..

కొరవడిన పర్యవేక్షణ...

జిల్లాలో నాలుగేళ్ల కిందట సొంత భవనాలు లేని 117 పంచాయతీలకు ఉపాధి హామీ నుంచి రూ.18.72 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 19 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 37 పనులు వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా విడిచిపెట్టేశారు. స్లాబ్‌, లింటల్‌, పునాది స్థాయిలోనే ఉండిపోయాయి. వీటికి దాదాపు రూ.5.67 కోట్లు ఖర్చు చేశారు. మరో 61 పంచాయతీల్లో నిధులున్నా పనులు ప్రారంభించలేదు. దీంతో ఆయా పంచాయతీ ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు ఏదైనా సమావేశం నిర్వహించుకోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. నిధులు సమృద్ధిగా ఉన్నా పనులు ఎందుకు పూర్తి చేయలేదని ఆరా తీయగా అప్పట్లో ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపొనెంట్‌ నిధుల చెల్లింపుల్లో ఆలస్యం జరిగింది. దీంతో అసంపూర్తిగా పనులు విడిచిపెట్టేశారు. ప్రారంభించనివారు బిల్లులు రావనే భయంతోనే పనులను విడిచిపెట్టేశారు. దీంతో దాదాపు రూ.6 కోట్లకుపైగా నిధులు మురిగిపోయాయి. పనుల్లో పంచాయతీ ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణా లోపం కనిపిస్తోంది.

వివరాలు సేకరిస్తున్నాం - మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

సొంత భవనాలు లేని పంచాయతీల వివరాలను సేకరిస్తున్నాం. ఉపాధి హామీ నిధులు కేటాయిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అన్ని పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని