రూ. లక్షలు వెచ్చించి.. లక్ష్యాన్ని విస్మరించి..
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

రూ. లక్షలు వెచ్చించి.. లక్ష్యాన్ని విస్మరించి..

నిరుపయోగంగా ఆటోలు, ఇనుప స్టాండ్‌లు

వికారాబాద్‌ పురపాలికలో ఇదీతీరు

మూలకు చేరిన విద్యుత్తు చెత్త ఆటోలు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పేరుతో వస్తువులను కొనుగోలు చేయడంపై ఉన్న ఆసక్తి, వాటి వినియోగంలో కనిపించడం లేదు. దీంతో రూ.లక్షల్లో ప్రజాధనం వృథా అవడమే కాకుండా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం విభాగం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. చెత్త తరలించేందుకు విద్యుత్తు వాహనాలు, ప్రధాన కూడళ్లలో చెత్త పారబోయకుండా ఏర్పాటు చేయడానికి ప్లాస్టిక్‌ డబ్బాలు కొనుగోలు చేశారు. వాటిని వినియోగించకపోవడంతో మూలకు చేరాయి.

జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధిలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి చెత్తదిబ్బకు (డంపింగ్‌ యార్డుకు) తరలించేందుకు 15 విద్యుత్తు ఆటోలను కొనుగోలు చేశారు. ఇందుకోసం గతేడాది 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.30 లక్షలు వెచ్చించారు. ప్రారంభంలో మూడు నెలల పాటు వాటిని సక్రమంగా వినియోగించారు. అనంతరం మరమ్మతుకు వచ్చాయని 13 ఆటోలను పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో మూలకు చేర్చారు. ఇందులో కొన్ని వాహనాలకు బ్యాటరీలు, ఇతర పరికరాలు కనిపించడంలేదు. ఈ వ్యవహారంలో సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రెండు వాహనాలను వినియోగిస్తున్నారు.

వృథాగా మిగిలిన స్టాండ్లు ఈ డబ్బాలు ఏమయ్యాయో..

రోడ్లపై చెత్త వేయకుండా: పట్టణంలో ప్రధాన రహదారులు, బస్టాండ్‌, ఆటో స్టాండ్‌, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో, ఇతర కూడళ్లలో చెత్త ఆరుబయట వేయకుండా ప్లాస్టిక్‌ డబ్బాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక ప్లాస్టిక్‌ డబ్బా, దానిపై మూత, ఇనుప గ్రిల్‌ ఒక సెట్‌ రూ.10వేలు. దీనికి అవసరమైన రూ.10 లక్షలను 14వ ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి, ఇతర ఖాతాల నుంచి కేటాయించారు. బ్రాండెడ్‌ చెత్త డబ్బాలు, వాటిని అమర్చడానికి ఇనుప స్టాండ్‌లను కొనుగోలు చేశారు. ఇందులో దాదాపు 30 స్టాండ్లు అమర్చి, డబ్బాలను ఏర్పాటు చేశారు. మిగతావి కార్యాలయ ఆవరణలో ఒక పక్కన పెట్టారు. వర్షాలకు అవి తుప్పుపడుతున్నాయి. ప్లాస్టిక్‌ డబ్బాలు మాత్రం కనిపించుకుండా పోయాయి. ఇవి ఎక్కడున్నాయని ఆరా తీస్తే సిబ్బంది ఇళ్లల్లో మంచి నీరు, బియ్యం, ఇతర సామగ్రి కోసం వాడుకుంటున్నారని తెలిసింది.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

- శరత్‌చంద్ర, పురపాలక సంఘం కమిషనర్‌, వికారాబాద్‌

ఈ విషయం మా దృష్టికి రాలేదు. సత్వరం పరిశీలించి, వాటిని వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించాలని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని