అరచేతిలో ఆస్తుల చిట్టా
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

అరచేతిలో ఆస్తుల చిట్టా

పురపాలికల్లో చివరి దశలో సర్వే

ఆక్రమణలకు పడనున్న కళ్లెం

పురపాలికల్లో సర్వే పనులు

కొడంగల్‌, న్యూస్‌టుడే: అరచేతిలో సమగ్ర ఆస్తుల సమాచారం త్వరలోనే అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించిన కసరత్తు పురపాలికల్లో కొనసాగుతుంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చిన భువన్‌సర్వేతో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలను సేకరించి అందులో నిక్షిప్తం చేయనున్నారు. ప్రతి ఇంటికి జియోట్యాగింగ్‌ చేస్తున్నారు. కొడంగల్‌ పురపాలికలో మొత్తం 3,827 నివాసాలు ఉన్నాయి. అందులో గత సంవత్సరం 1180 ఇళ్లకు సర్వే పూర్తికాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 3,607 ఇళ్ల సర్వే పూర్తి అయ్యింది. దాదాపు 220 ఇళ్ల సర్వేలు పూర్తి కావాల్సి ఉంది.

ఇదీ ప్రయోజనం..

* రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల ఆస్తులు అన్ని ఈ ప్రక్రియ ద్వారా జియో ఇన్ఫ్‌ర్మేషన్‌ సిష్టం ఆధారిత మ్యాప్‌ తయారీకి ఉపకరిస్తుంది.

* అవసరమైనప్పుడు చిత్రాలు, వివరాలను తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ వేదిక రూపుదాలుస్తుంది.

* రిజిస్ట్రేషన్‌శాఖతో సమన్వయం వలన జియోట్యాగింగ్‌ పూర్తి అయిన ఆస్తుల స్వరూపం, ఈసీ, భూమి నిషేధిత జాబితాలో ఉందా? తదితర వివరాలన్నీ ఏవరైనా స్పష్టంగా తెలుసుకోవచ్ఛు

* అక్రమ రిజిస్ట్రేషన్ల బెడద తప్పుతుంది. ఇంటి పన్ను మదింపులో మున్సిపల్‌ సిబ్బంది ఆస్తి యజమాని కుమ్మక్కు అయ్యే అవకాశాలు ఉండవు.

* ఇందులో ప్రభుత్వ ఆస్తుల సమస్త సమాచారం ఉంటుంది. పట్టణంలో వీధి దీపాలు, పచ్చదనం బస్‌షెల్టర్స్‌, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, నీటి సరఫరా తదితర వివరాలు కూడా నమోదు అవుతాయి.

13 అంశాల వివరాల సేకరణ..

అధికారులు పురపాలిక పరిధిలో తమకు అప్పగించిన ప్రాంతంలోని గృహాలు, వ్యాపార సముదాయాలు, భవనాలను, రెండు కోణాల్లో ఫొటోలు తీస్తారు. బయటి నుంచి పొడవు, వెడల్పు కొలతలు వేస్తారు. ఇంటి ఫొటోలను కొలతలను యాప్‌లో నమోదు చేసి అప్‌లోడ్‌ చేస్తారు. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా, కొలతలన్నీ నిక్షిప్తమవుతాయి. ఇంటి యజమాని నంబరు, ఇంటి నంబరు, ఇంటి పన్ను, చిరునామా, వివరాల నిర్మాణం అనుమతి, యజమాని ధ్రువీకరణ పత్రాల వివరాలను, సేకరించి అప్‌లోడ్‌ చేస్తారు. 13 అంశాలపై వివరాలు సేకరించి ఏ రోజుకా రోజు సీడీఎంఏ సర్వర్‌కు పంపిస్తారు.

పొరపాటు జరగకుండా చూడాలి..

సమాచారాన్ని నమోదు చేసేటప్పుడు పొరపాట్లు లేకుండా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు. 60 సంవత్సరాలు దాటిన ఇళ్లకు సైతం యుఏసీ (ఆథరైజ్డ్‌ కన్‌స్ట్రక్షన్‌)గా నిర్థరించి జియోటాగ్‌ చేయడంతో గృహాలకు అపరాద రుసుం పడుతుంది. దీంతో ఎంతో మందికి నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకోసం సర్వే చేసే సమయంలో సర్వే ఏమిటి? ఏందుకు జరుగుతుంది? అనే అంశాలను ప్రజలకు తెలియజేస్తే పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు. దీంతో సరైన సమాచారం నమోదు అవుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని