నాడు ప్రథమం నేడు అభివృద్ధి పథం
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

నాడు ప్రథమం నేడు అభివృద్ధి పథం

తాండూరు మున్సిపాలిటీ కార్యాలయం

న్యూస్‌టుడే, తాండూరు: తాండూరు మున్సిపాలిటీ..ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలో ఏర్పాటైన ప్రథమ మున్సిపాలిటీ. నిజాం కాలంలో కర్ణాటక రాష్ట్రం చించోళి తాలుకా పరిధిలో కొనసాగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడగానే హైదరాబాద్‌ జిల్లాలోకి మారింది. 1950 నుంచి మున్సిపాలిటీ పరంగా పట్టణ ప్రజలకు సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి రంగారెడ్డి జిల్లా విడిపోయనపుడు కూడా ఇదే జిల్లాలో ప్రథమ మున్సిపాలిటీ. మొదట్లో పరిపాలన కొనసాగించడానికి సొంత భవనం లేదు. అద్దె ప్రాతిపదికన ప్రైవేటు భవనంలో నడిచింది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ విభాగం వంటి శాఖల్లో విధులు నిర్వహించే సిబ్బంది పరిమితంగానే ఉన్నారు. నిధుల లభ్యత కూడా అంతంత మాత్రమే కావడంతో అభివృద్ధి పనులు నామమాత్రంగానే జరిగాయి. అద్దె భవనంలో కొనసాగిన పరిపాలన భవనం స్థానే పదేళ్ల తర్వాత సొంత భవనం సమకూరింది.

10 వేల నుంచి 75 వేలకు జనాభా

మొదట్లో తాండూరు పట్టణ జనాభా కేవలం 10వేల మంది లోపే. కాలక్రమేణ పట్టణం వ్యాపార, వాణిజ్య పరంగా పేరుగాంచింది. దీంతో దేశంలోని గుజరాత్‌, కర్ణాటక, మహరాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన చాలా మంది తాండూరు పట్టణానికి వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడే స్థిరపడి పోయారు. వీరికి తోడు తాండూరు నియోజక వర్గ గ్రామాలకు చెందిన సంపన్నులు కూడా పట్టణానికే మకాం మార్చారు. కొందరు సొంతంగా గృహాల నిర్మాణం చేసుకుంటే మరికొంత మంది అద్దె గృహాల్లో నివాసం ఉంటూ వచ్చారు. పట్టణంలో అద్దెకు ఉండే వారిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది అదనపు గృహాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పట్టణంలో 14000 గృహాల్లో 71000 మంది జనాభా నివాసం ఉంటున్నారు. 12 వార్డులుగా ఉన్న మున్సిపాలిటీ 36 వార్డులకు విస్తరించింది.

1995 నుంచే అభివృద్ధి పనులు

తాండూరు మున్సిపాలిటీలో 1995 నుంచే అభివృద్ధి పనుల వేగం పెరిగింది. కొత్తగా కాలనీలు విస్తరించాయి. విద్యాసంస్థలు వెలిశాయి. వ్యాపార దుకాణాల సంఖ్య పెరిగింది. కాగ్నానది నుంచి ఒక పంపు హౌస్‌ నాలుగు ట్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా జరిగే తాగు నీరు ప్రస్తుతం రెండు పంపు హౌస్‌లు, 6 పెద్ద ట్యాంకుల ద్వారా 8.5 ఎంఎల్‌డి సరఫరా జరుగుతుంది. ఇంటింటికి తాగు నీటిని సరఫరా చేసేందుకు మిషన్‌ భగీరథ కింద కుళాయిలను అమర్చే స్థాయికి చేరుకుంది. మట్టి రోడ్ల స్థానే సిమెంటు రోడ్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం పట్టణంలో రూ.కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.


విస్తరణ ఇలా..

* 5.82 చదరపు కి.మీ.నుంచి 29.19 చదరపు కి.మీలకు పెరిగింది

* 13000 నివాస గృహాల సంఖ్య 20,000కు చేరుకోనుంది.

* రూ.3 కోట్లుగా వచ్చే ఆదాయం రూ.9 కోట్లుగా వస్తుందని అంచనా.

* రూ.18.31 కోట్ల మున్సిపల్‌ బడ్జెట్‌ ప్రస్తుతం రూ.64.60 కోట్లకు చేరింది.

* ప్రస్తుతం కొనసాగుతున్న పురపాలిక భవనం సిబ్బంది విధుల నిర్వహణకు సరిపోక పోవడంతో రూ.3కోట్ల వ్యయంతో కొత్తగా ప్రభుత్వం మరో భవనాన్ని నిర్మించింది.

* మున్సిపాలిటీలో 150 కి.మీ. మేర మురుగు ప్రవహించే కాల్వలు ఉన్నాయి.

* 130 కి.మీ. పొడవునా రోడ్లుంటే ఇందులో ఇందులో సిమెంటు రోడ్లు 60 కిలో మీటర్లు ఉన్నాయి.


మారనున్న రూపురేఖలు: స్వప్న, తాండూరు మున్సిపల్‌ ఛైర్మన్‌

మరో రెండేళ్లలో తాండూరు పట్టణం రూపురేఖలు మారనున్నాయి. రూ.36 కోట్లతో కొత్తగా సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తయింది. మరో రూ.2కోట్ల విలువ చేసే పనులు జరగాల్సి ఉంది. కొత్తగా గృహాల నిర్మాణంతో పురపాలికకు ఆదాయం సమకూరుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని