సేవలు విస్తరిస్తే సహకారం అందిస్తాం
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

సేవలు విస్తరిస్తే సహకారం అందిస్తాం

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌
ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్‌, వేదికపై చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య,
ఎంపీ రంజిత్‌రెడ్డి, డాక్టర్‌ ప్రదీప్‌గార్గ్‌, డా.జీఎన్‌రావు, తదితరులు

బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో మందికి మేలు చేశారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ కంటికి సంబంధిత సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తోందని.. వికారాబాద్‌లోనూ సంస్థ సేవలను ప్రారంభిస్తే అక్కడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ నగరపాలిక పరిధిలోని దర్గాఖలీజ్‌ఖాన్‌(కిస్మత్‌పూర్‌)లో ఉన్న ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, గుళ్లపల్లి ప్రతిభారావు ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ ఐ కేర్‌లో ‘పూర్ణిమ-రామం’ ఆత్మకూరి టెక్నాలజీ కేంద్రాన్ని చేవెళ్ల ఎంపీ డా.గడ్డం రంజిత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో చాలా మందికి ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని కనుగొనే శక్తి ఉందని, అలాంటి వారిని గుర్తించి కావాల్సిన విధంగా ఇక్కడే ఎన్నో వైద్య పరికరాలను తయారు చేసుకోవచ్చని, ఇది ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగం అవుతుందన్నారు. ప్రస్తుతం 80శాతానికి పైగా వైద్య పరికరాలను మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఇంత సాంకేతికత ఉన్నప్పటికీ ఎందుకో చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి సంస్థ రాష్ట్రంలో చాలా చోట్ల సేవలు అందిస్తోందని.. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలోనూ ఉందని తెలిపారు. వికారాబాద్‌ ప్రాంతంలో సేవలు విస్తరిస్తే ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కొత్తగా ప్రారంభించిన కేంద్రంలో చేపట్టే సేవలు, వాటి పనితీరును ఆయన పరిశీలించారు. ఎల్వీప్రసాద్‌ కంటి ఆసుపత్రి సంస్థ వ్యవస్థాపకుడు డా.జీఎన్‌ రావు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ప్రశాంత్‌ గార్గ్‌, వైస్‌ఛైర్మన్‌ రామం ఆత్మకూరి, పూర్ణిమ ఆత్మకూరి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఉన్నారు. కేంద్రం ప్రారంభానికి ముందు మంత్రి కేటీఆర్‌ మొక్క నాటి నీళ్లు పోశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని