పన్ను పోటు.. ప్రజల పాట్లు
eenadu telugu news
Published : 23/09/2021 02:53 IST

పన్ను పోటు.. ప్రజల పాట్లు

గ్రేటర్‌లో 709 కి.మీ. రోడ్లు ప్రైవేటు నిర్వహణకు

వాటి పొడవునా శిస్తు పెంచేందుకు సర్వే మొదలు

చందానగర్‌లో ఇంటిని సర్వే చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారి

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో ఆస్తి పన్ను పెంచేందుకు అధికారులు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే వాణిజ్య రహదారుల పొడవునా ఉండే భవన సముదాయాలు, నిర్మాణాలపై దృష్టిపెట్టారు. సరైన మొత్తంలో పన్ను చెల్లిస్తున్నారా? తక్కువ చెల్లిస్తున్నారా..? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. తద్వారా బల్దియాకు రూ.100 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరనుంది. తాజాగా మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం(సీఆర్‌ఎంపీ) కింద ప్రైవేటు ఏజెన్సీల నిర్వహణకు ఇచ్చిన 709 కి.మీ. రహదారులను ఎంచుకొన్నారు. ఈ రోడ్లకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలకు పునర్మదింపు చేసి మరో రూ.100 కోట్ల ఆదాయం పెంచుకొనేందుకు సర్వే చేపట్టారు. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.

మార్గదర్శకాలు లేకుండానే..

ఆస్తి పన్ను పునర్మదింపునకు జీహెచ్‌ఎంసీ ఎంచుకున్న మార్గాలు పౌరులకు తలనొప్పిగా మారాయి. ఇటీవల ప్రైవేటు రోడ్ల పొడవునా చేపట్టిన ఆస్తుల సర్వే అందుకు ఉదాహరణ. కేంద్ర కార్యాలయం ఇచ్చిన యాప్‌లో పేర్కొన్న వివరాలను చందానగర్‌లో ఇంటింటికీ తిరిగి సేకరిస్తున్నారు. కిరాయిదారులు, తాళం వేసిన నిర్మాణాల సర్వే సమయంలో ఇంటి నిర్మాణ అనుమతి పత్రాలు తమ వద్ద లేవని కిరాయిదారులు చెబుతుంటే.. అసలు అనుమతి లేదన్నట్లుగా యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఫలితంగా భవన యజమానిపై భారం పడుతోంది. ఆస్తిపన్నుపై జరిమానా పడుతోంది. కేంద్ర కార్యాలయం ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ఓ యాప్‌ తయారు చేయించి సర్వే చేపట్టమనగా.. అధికారులు గుడ్డిగా దాన్ని అనుసరిస్తున్నారు. అందుబాటులో లేకుంటే కరపత్రం ఇస్తున్నారు. 15 రోజుల్లో యజమాని ఆ నిర్మాణానికి ఆస్తి పన్నును స్వీయ మదింపు పద్ధతి ద్వారా సవరించుకోవాలని, ఆ విధానం కరపత్రంలో ఉందంటున్నారు. లేదంటే జరిమానాతో పన్ను విధిస్తామంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని