రక్షకులూ.. సైబర్‌ బాధితులే
eenadu telugu news
Published : 23/09/2021 03:51 IST

రక్షకులూ.. సైబర్‌ బాధితులే

కేటుగాళ్ల వలకు చిక్కుతున్న పోలీసులు

ఫిర్యాదులపై కంగుతింటున్న ఉన్నతాధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ మోసాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించే పోలీసులే బాధితులుగా మారుతున్నారు. కేటుగాళ్ల వలకు చిక్కి నిండా మునుగుతున్నారు. ఎంతోకొంత అవగాహన ఉన్నా ఖాతాలు ఖాళీ అయ్యే వరకూ గుర్తించకపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తరచూ ఫిర్యాదులు అందుతుండటంతో ఉన్నతాధికారులు కంగుతింటున్నారు. ఎలా మోసపోయారో తెలుసుకుని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ.. రూ.7లక్షలు

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలొస్తాయంటూ ఓ కానిస్టేబుల్‌కు వాట్సాప్‌లో సందేశం వచ్చింది. అవతలివైపు వ్యక్తి తన పేరు సేనాపతి సాయి కుమార్‌గా పరిచయం చేసుకుని ‘సినిమా’ చూపించాడు. మీకు నమ్మకం లేకపోతే రూ.7.5 లక్షల బ్లాంక్‌ చెక్‌ ఇస్తానని పంపించాడు. దీంతో నమ్మకం కుదిరి కేటుగాడు చెప్పిన బ్యాంక్‌ ఖాతాకు సదరు కానిస్టేబుల్‌ రూ.5.5 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేశాడు. ఇదే విషయాన్ని తన పై అధికారి(ఎస్‌ఐ)కి కూడా చెప్పాడు. ఎస్‌ఐ సైతం రూ.1.5 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. తీరా చూస్తే.. అటువైపు నుంచి స్పందన లేదు. ఆ చెక్‌ కూడా పనికి రాదని తేలడంతో.. మోసపోయినట్లు తెలుసుకుని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

రిటైర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ రూ.77వేలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ కొత్తపేట్‌కు చెందిన ఓ రిటైర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న రూ.77వేలు స్వాహా చేశారు. మీ సిమ్‌ కేవైసీ ప్రక్రియ పూర్తి కాలేదని.. త్వరలో సర్వీస్‌ నిలిపేయనున్నట్లుగా సందేశం వచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పేరిట రావడంతో నిజమేననుకుని ఆధార్‌, ఇతర ధ్రువపత్రాలు పంపించాడు. తర్వాత టీం వ్యూయర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమంటే చేసుకున్నాడు. అనంతరం రూ.10 రీఛార్జ్‌ చేసుకోవాలని చెప్పడంతో అలానే చేశాడు. మొదటిసారి ఫెయిలైందని.. మరో ఖాతా నుంచి చేయమంటే అలానే చేశాడు. ఆ క్రమంలోనే టీంవ్యూయర్‌ యాప్‌ సాయంతో కేటుగాడు బ్యాంక్‌ ఖాతా వివరాలు సేకరించాడు. ఓటీపీ అడిగితే చెప్పాడు. మీ కేవైసీ అప్‌డేట్‌ అయ్యిందని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. తర్వాత రెండు ఖాతాలు ఖాళీ కావడంతో మోసపోయినట్లు గ్రహించి రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.


విశ్రాంత ఎస్‌ఐ రూ.11 లక్షలు

మైలార్‌దేవ్‌పల్లిలో ఉండే రిటైర్డ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బ్యాంక్‌ ఖాతాలో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద రూ.17 లక్షలు జమ చేసింది. జూలై 17న ఖాతాలో బ్యాలెన్స్‌ చూసుకోగా రూ.1.28 లక్షలు మాత్రమే ఉండటంతో కంగుతిన్నాడు. బ్యాంకులో స్టేట్‌మెంట్‌ తీసుకుని పరిశీలించగా గతేడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు రూ.11 లక్షలు విత్‌డ్రా అయినట్లు తెలిసింది. ఈ తరహాలోనే ఆయన కుమార్తె ఖాతా నుంచి కూడా రూ.50వేలు మాయమయ్యాయి. ఆయన సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని