అడిగినంత ఇవ్వకుంటే.. అడ్డంగా బుక్కయినట్టే!
eenadu telugu news
Updated : 23/09/2021 05:27 IST

అడిగినంత ఇవ్వకుంటే.. అడ్డంగా బుక్కయినట్టే!

సర్కారు కార్యాలయాల వద్ద దళారుల ముఠా దందా
సికింద్రాబాద్‌ పరిధిలో రెచ్చిపోతున్న అక్రమార్కులు

ఈనాడు, హైదరాబాద్‌, బన్సీలాల్‌పేట్‌ న్యూస్‌టుడే: కేసులు.. జైళ్లంటే భయం లేదు. పలుమార్లు ఊచలు లెక్కపెట్టి వచ్చినా పద్ధతి మారలేదు. బయటకు రాగానే మళ్లీ వక్రబుద్ధితో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే లబ్ధిదారుల అవసరాలను అవకాశంగా చేసుకుని కొన్ని ముఠాలు వసూళ్లకు దిగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుల వివరాలు సేకరించి మరీ దందా చేస్తున్నాయి. గతంలో రెండు పడక గదుల గృహాలను కేటాయిస్తామంటూ పేద కుటుంబాల నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ ఇళ్లలో ఆడపిల్లలు బయటకు రాలేరంటూ బెదిరింపులకు దిగారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. సికింద్రాబాద్‌ కేంద్రంగా రెండు ముఠాలు చెలరేగుతున్నాయి. తమకు సహకరించకుంటే ఇక్కడ ఉద్యోగం చేయలేరంటూ ఓ తహసీల్దార్‌ను బెదిరించేంతగా ముఠా సభ్యులు పేట్రేగడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

దరఖాస్తు చేసుకుంటే చాలు..

రెండు ముఠాలు. ఒక్కోదానిలో 4-5 మంది సభ్యులు. వీరికి రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు వేదికలు. తిరుమలగిరి, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుదారులే వారి లక్ష్యం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు తదితర వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. అవతలి వారు ముఠాల చేతికి చిక్కినట్టే. సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఇంటి నిర్మాణం చేపట్టినా, బోరు తీసేందుకు వాహనం వచ్చినా ముఠా సభ్యులు అడిగినంత ఇవ్వాల్సిందే. లేకుంటే చేపట్టిన పనులు పూర్తిచేయకుండా అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తారు. తమ పథకం అమలు కావట్లేదని భావిస్తే అర్ధరాత్రి ఆయా వ్యక్తుల నివాసాల వద్ద గొడవకు దిగుతారు. ఒక్కో ముఠాలోని సభ్యుడూ ప్రతి నెలా రూ.50వేల నుంచి లక్ష వరకూ సంపాదిస్తారని ఓ న్యాయవాది ఆరోపించారు. వీరి ఆగడాలకు గురైన వారిలో తానూ ఉన్నానంటూ వాపోయారు.


రూటు...రేటు సెపరేటు

షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, ఎన్‌వోసీ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం, కుల, నివాస తదితర దరఖాస్తుదారులే వీరి లక్ష్యం. ఆయా కార్యాలయాల్లో తమకు అనుకూలంగా ఉన్న సిబ్బంది ద్వారా, సహచట్టం ద్వారా వివరాలు సేకరిస్తారు. ఆ తరువాత ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. కాదని ఎదురుతిరిగితే తప్పుడు పత్రాలతో న్యాయస్థానాల్లో కేసులు వేసేందుకు వెనుకాడరని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు. ముషీరాబాద్‌ దగ్గరలోని హోటల్‌ వీరికి అడ్ఢా వీరి వద్దకు వచ్చే వారి సెల్‌ఫోన్లు ముందుగానే తనిఖీ చేస్తారు. ఆ తరువాత హోటల్‌లో కూర్చోబెట్టి మాట్లాడతారు. అక్కడ మరో ఇద్దరు నిఘా ఉంటారు. దీనిపై కొందరు బాధితులు, సికింద్రాబాద్‌ ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


ఇంటిదొంగల సహకారం

కార్యాలయాలకు వచ్చే దరఖాస్తుల వివరాలను కొందరు ఉద్యోగులు ఈ ముఠాలకు అందజేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దీనికి కారణమని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఈ ముఠా సభ్యులనే పంపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. డిమాండ్‌ చేసినంత చేతిలో పడకుంటే దరఖాస్తులు ముందుకు కదలవని చెబుతారు. దీనికి ప్రతిఫలంగా దళారులు సంబంధిత ఉద్యోగికి ఖరీదైన బహుమతులు అందజేస్తారు. గతంలోనూ ఉన్నతాధికారులు అతణ్ని మందలించి వదిలేశారు. మళ్లీ మామూలే. ‘సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో జరుగుతున్న ముఠాల ఆగడాలపై ఆర్డీవో వసంతకుమారిని ‘ఈనాడు’ వివరణ కోరగా.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని