నేర వార్తలు
eenadu telugu news
Updated : 23/09/2021 04:14 IST

నేర వార్తలు

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య

అల్వాల్‌, న్యూస్‌టుడే: భర్త మరణంతో మానసిక ఒత్తిడితో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. కానాజిగూడలోని ఇందిరానగర్‌లో నివసించే లక్ష్మి(45) జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. భర్త శ్రీనివాస్‌ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి. వీరికి 22 ఏళ్ల కుమార్తె ఉంది. రెండు నెలల క్రితం శ్రీనివాస్‌ చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో మునిగి చనిపోయాడు. అప్పటి నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో బుధవారం స్థానికంగానే ఉండే బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చింది. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


దారికాచి.. దారుణంగా హతమార్చి

గోల్కొండ, న్యూస్‌టుడే: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ ఠాణా పరిధిలోని టోలిచౌకిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. టోలిచౌకి నదీంకాలనీకి చెందిన సయ్యద్‌ జిలానీ(50) కిరాణా దుకాణంలో పనిచేస్తుంటాడు. మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వస్తుండగా టోలిచౌకి మహబూబ్‌ ఫంక్షన్‌హాల్‌ ముందు రోడ్డుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి, కత్తులతో జిలానీపై దాడి చేసి హతమార్చారు. హత్యకు కొద్ది ముందే జిలానీ భార్య ఫర్జానాబేగంకు ఫోన్‌ చేసి ఆర్టీసీ బస్సులో ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. ఎంతకీ రాకపోవడంతో భార్య తిరిగి ఆయనకు ఫోన్‌ చేశారు. ఇతరులు ఫోన్‌ ఎత్తి విషయం తెలపడంతో ఆమె ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. ఎండీలైన్స్‌కు చెందిన బట్టల వ్యాపారి ఇమ్రాన్‌ అతని కుటుంబ సభ్యులే తన భర్తను హత్యచేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జిలానీ కూతురును అల్లుడు సల్మాన్‌ తరచూ కొడుతూ, చిత్రహంసలకు గురిచేసేవాడు. దీంతో జనవరిలో జిలానీ తన బంధువులతో కలిసి రాయదుర్గం ఠాణా పరిధిలోని మణికొండలో బట్టల దుకాణంలో పనిచేసే సల్మాన్‌ను దుకాణం నుంచే అపహరించారు. అనంతరం మొయినాబాద్‌ సమీపంలోకి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ కేసులో మృతుడు జిలానీ ఏ2గా ఉన్నాడు. అప్పటి నుంచి జిలానీపై పగతో ఉన్న సల్మాన్‌ తమ్ముడు ఇమ్రాన్‌ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇమ్రాన్‌ కోసం గాలిస్తున్నారు.


బిల్లులు రాక.. బల్దియా గుత్తేదారు ఆత్మహత్య

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులు తీర్చలేక ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబీకుల వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌ సమీప మునుగనూర్‌ ఆదర్శనగర్‌ కాలనీలో వరికుప్పల నర్సింహా(40) భార్య ఆండాలు, కుమార్తె, కుమారుడితో ఉంటున్నాడు. పదేళ్లుగా జీహెచ్‌ఎంసీ సివిల్‌ గుత్తేదారుగా పనిచేస్తున్నారు. చేసిన పనులకు రెండేళ్లుగా బిల్లులు ఆగిపోయాయి. అప్పులోళ్ల ఒత్తిళ్లు పెరిగాయి. ఇంటి నిర్మాణానికి తీసుకున్న బ్యాంకు రుణం ఈఎంఐలు చెల్లించలేకపోయారు. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో బుధవారం ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. భార్య మధ్యాహ్నం ఇంటికి రాగా తలుపులకు గడివేసి ఉంది. ఉరేసుకొన్న భర్తను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందారు. రూ.30 లక్షల బిల్లులు రావాల్సి ఉందని ఫిర్యాదులో పేర్కొనగా కేసు నమోదు చేశారు.


వ్యాపారమంటూ వలేసి రూ.43 లక్షలు మాయం

నారాయణగూడ, న్యూస్‌టుడే: బంగారం, వజ్రాల వ్యాపారం చేస్తారా..? అని ఆశలు కల్పించి, రూ.43 లక్షలు కాజేశారని బాధితుడొకరు బుధవారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. ఈదీబజార్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఆదిల్‌కు ఇటీవల +44తో మొదలయ్యే నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. మీరు బంగారు, వజ్రాల వ్యాపారం చేస్తారా..? అని అవతలి వ్యక్తి అడిగాడు. బాధితుడు ఉందని చెప్పడంతో అవతలి వ్యక్తి ఓ లింక్‌ పంపి, అందులో వివరాలు పొందుపర్చాలని చెప్పాడు. అందులో ఆదిల్‌ ముందుగా రూ.1000 పెట్టారు. ఆ పెట్టుబడికి రెండింతలు అయినట్లు నగదు వెబ్‌ యాప్‌లో కనిపిస్తోంది. ఇలా విడతల వారీగా రూ.43 లక్షలు పెట్టుబడి పెట్టగా.. రూ.1.50 కోట్లు యాప్‌లో కనిపిస్తోంది. కానీ.. విత్‌డ్రా చేసుకోవడానికి వీలుపడ లేదు. మోసపోయానని గ్రహించిన ఆదిల్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.


హోటల్‌ స్నానపు గదిలో కెమెరా!

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: స్నానపు గదిలో కెమెరా సహిత చరవాణి పెట్టి వీడియోలు తీస్తున్న ఓ యువకుణ్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్గొండ జిల్లా బట్టిగూడెంకు చెందిన బొంగరాల బెనర్జీ(18) కృష్ణానగర్‌లో ఉంటూ జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.10లోని వన్‌ డ్రైవ్‌ ఇన్‌లో హౌస్‌కీపింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. హోటల్లోని స్నానపుగదిలో రహస్యంగా చరవాణిని అమర్చాడు. యువతులు, మహిళలు వెళ్లినప్పుడు దృశ్యాలను వీడియో తీసేలా ఏర్పాటు చేశాడు. మంగళవారం అర్ధరాత్రి ఓ యువతి(25)కి అనుమానం వచ్చి స్నేహితుల ద్వారా మేనేజర్‌ను నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా పరిశీలించి చరవాణిని స్వాధీనం చేసుకొని బెనర్జీపై కేసులు నమోదు చేశారు.


లిఫ్టులో బాలికపై అసభ్య ప్రవర్తన

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే బాలిక(8) మూడో తరగతి చదువుతోంది. కింది భాగంలో తన స్నేహితురాలితో కలిసి ఆడుకుంటోంది. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ కాపలాదారుడి కుమారుడు(14) అక్కడికి వచ్చి ఆరో అంతస్తులో ఎవరో పిలుస్తున్నారని, తనతో ఒంటరిగా రావాలని బాలికను కోరాడు. లిఫ్టులో తీసుకెళుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వ్యక్తిగత భాగాలను తాకాడు. బాధిత బాలిక తల్లికి చెప్పడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.


కుమార్తెపైనే పశువాంఛ

కాటేదాన్‌, న్యూస్‌టుడే: కన్న కుమార్తెపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ తండ్రి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటనకు సంబంధించి రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్‌ వివరాల ప్రకారం... కాటేదాన్‌లో ఉండే ఓ వ్యక్తి(35) భార్య ఏడేళ్ల క్రితం మృతిచెందింది. తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని హాస్టల్‌లో చేర్పించాడు. కరోనాతో హాస్టళ్లు మూతపడడంతో వారు తండ్రితో ఉంటున్నారు. వరుసలు మరిచిన ఆ తండ్రి పెద్ద కుమార్తె(13)పై కన్నేశాడు. బెదిరిస్తూ 15 రోజులుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. రెండు రోజుల కిందట తండ్రిలేనప్పుడు బయటకొచ్చిన బాలిక స్థానికులకు ఆ దురాగతాన్ని చెప్పింది. స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని