మాట్లాడే చేతులు.. మార్చే తలరాతలు
eenadu telugu news
Published : 23/09/2021 04:07 IST

మాట్లాడే చేతులు.. మార్చే తలరాతలు

నగరం కేంద్రంగా ‘డీఈఎఫ్‌’ సంస్థ విశేష కృషి

నేడు ప్రపంచ సంజ్ఞా భాషా దినోత్సవం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఓ నిమిషం నిశ్శబ్దాన్ని తట్టుకోలేం.. ఓ గంట మాట్లాడకుండా ఉండలేం.. అలాంటిది జీవితమంతా నిశ్శబ్దమే ఆవరిస్తే.. ఎంతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతే.. ఈ ప్రపంచం మాటేమిటో వినాలనున్నా వినలేకపోతే..? బధిరులదీ ఇదే కష్టం. వీరి కోసం ఓ భాషనే సృష్టించింది నగరానికి చెందిన ‘డఫె్‌ ఎనెబుల్డ్‌ ఫౌండేషన్‌’ సంస్థ. ఓ బధిరునిగా తాను ఎదుర్కొన్న కష్టాలు ఎవరికీ రాకూడదనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించి.. వేలాది మంది బధిరులకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన టీకేఎం సందీప్‌. పన్నెండేళ్లుగా దేశవ్యాప్తంగా బధిరులకు అండగా నిలుస్తోన్న ఈ సంస్థపై నేడు ప్రపంచ సంజ్ఞా భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

భాష పుట్టుక ఇక్కడే..

బధిరులకు విద్యతో పాటు ఉపాధి కల్పించేందుకు, సమాజంలో గౌరవం దక్కేందుకు ఓ అధికారిక భాష ఉండాలని 2009లో హైదరాబాద్‌ కేంద్రంగా డీఈఎఫ్‌(డఫె్‌ ఎనెబుల్డ్‌ ఫౌండేషన్‌)ను స్థాపించారు టీకేఎం సందీప్‌. అప్పటికే బధిరులు అక్కడక్కడా వాడుతున్న సైగల్ని సేకరించి, నిపుణుల సాయంతో ఓ ప్రత్యేక లిపిని సృష్టించారు. దానిపై దేశవ్యాప్తంగా ఉన్న బధిరులందరికీ శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. దీన్ని అధికారిక భాషగా గుర్తించేందుకు పోరాటం చేస్తుండగా.. ఇటీవలె కేంద్రం తెచ్చిన కొత్త విద్యా విధానంలో సంజ్ఞా భాషకు చోటు దక్కడం విశేషం.

బతుకు నేర్పిస్తున్నారు...: బధిరులకు బధిరులే సంకేత భాష ద్వారా శిక్షణ ఇస్తున్నారు. నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహన దిశగా తర్ఫీదునిస్తున్నారు. దీంతో చాలామంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఆతిథ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ సాయంతో నగరంలో తొలిసారి టాకింగ్‌ హ్యాండ్స్‌ రెస్టారెంట్‌ నెలకొల్పారు.

చేతుల మూగబోయాయి..: నిశ్శబ్దం ఎంత బాగుంటుందో చూపించేది బేగంపేటలోని హరిత ప్లాజాలో ఉన్న ‘టాకింగ్‌ హ్యాండ్స్‌’ రెస్టారెంట్‌. ఇక్కడ పనిచేసే వారంతా బధిరులే. 2017లో మొదలైన ఈ హోటల్‌ కొవిడ్‌ తర్వాత నష్టాలతో పాటూ ప్రభుత్వం నుంచీ ఏ సాయమూ దక్కకపోవడంతో ఈ రెస్టారెంట్‌ ఇటీవలె మూతపడింది.

భాష నేర్పే యాప్‌..: హావభావాలు, భావోద్వేగాలు, ప్రాంతాలు, పర్యావరణం, రంగులు, కుటుంబంతో పాటు నిత్యజీవితంలో ఉపయోగపడే అన్ని రకాల భావాలు, అంశాలను సంకేత భాషలో నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ‘డీఈఎఫ్‌-ఐఎస్‌ఎల్‌’ యాప్‌ని రూపొందించారు నిర్వాహకులు.

సంస్థలో సిబ్బంది: 450, శిక్షణ పొందిన బధిరులు: 5,600పైగా,

ఉపాధి పొందినవారు: 3,200పైగా, శాఖలు: హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, పుదుచ్చేరి, వైజాగ్‌, థానే, తంజావూరు, మహబూబ్‌నగర్‌, కోల్‌కతా, అహ్మదాబాద్‌, ఇండోర్‌, విశాఖపట్నం.

ఇది అందరి భాషవ్వాలి..: రమ్య మిర్యాల, డీఈఎఫ్‌ సీఓఓ

ప్రపంచ వ్యాప్తంగా 41 దేశాల్లో సంకేత భాషకు గుర్తింపు లభించింది. ఇది అంతటా జరగాలి. అదే దిశగా మా సంస్థ ప్రయత్నం చేస్తోంది. సంకేత భాషను అన్ని పాఠశాలల్లో నేర్పించాలి. అన్నిరకాలుగా ఉపయోగపడుతుంది.

పెద్ద సంస్థల్లోనూ చోటు దక్కాలి : సందీప్‌, డీఈఎఫ్‌ సీఈఓ

బధిరులుగా కాదు వారిలోని ప్రతిభను గుర్తించే రోజు రావాలి. ఉద్యోగాలతో పాటు అంకుర సంస్థలూ నెలకొల్పగలగాలి. అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. సంజ్ఞా భాషను అందరికీ చేరువ చేసి అనుకున్న లక్ష్యం చేరుతాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని