అమీర్‌పేటలో ఆస్తి కోసం అరాచకం.. ఇద్దరు వృద్ధ మహిళల కిడ్నాప్‌
eenadu telugu news
Updated : 24/09/2021 10:01 IST

అమీర్‌పేటలో ఆస్తి కోసం అరాచకం.. ఇద్దరు వృద్ధ మహిళల కిడ్నాప్‌

తప్పించుకున్న బాధితులు.. అయిదుగురిపై కేసు నమోదు

అస్మత్‌ ఉన్నీసాబేగం,  మహమ్మదీ ఉన్నీసాబేగం

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఆస్తి కోసం ఇద్దరు వృద్ధ మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. మహిళలను అమీన్‌పూర్‌లోని ఓ గదిలో నిర్బంధించగా స్థానికుల సాయంతో తప్పించుకొన్నారు. ప్రధాన సూత్రధారి, మరో నలుగురిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. ఎస్సార్‌నగర్‌ సీఐ సైదులు వివరాల ప్రకారం.. అమీర్‌పేట లీలానగర్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు అస్మత్‌ ఉన్నీసాబేగం(73), మహమ్మదీ ఉన్నీసాబేగం(70)ను గురువారం ఉదయం నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంటి నుంచి కిడ్నాప్‌ చేశారు. కారులో వచ్చి వారిపై దాడి చేసి నిర్బంధించి తీసుకెళ్లారు. అమీన్‌పూర్‌లోని ఓ గదిలో చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్‌ అతికించి గదికి తాళం వేసి వెళ్లిపోయారు. అస్మత్‌ ఉన్నీసాబేగం తన చేతి కట్లను విడిపించుకుని కిటికీ వద్దకు వచ్చి రక్షించండంటూ కేకలు వేసింది. అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి బాధితులను విడిపించారు. అనంతరం స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు. అమీన్‌పూర్‌ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధితులను సాయంత్రం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఆ మహిళలకు న్యాయం జరిపించాలని బేగంపేటకు చెందిన సలీంఖాన్‌ తదితరులు పోలీసులను కోరారు.

స్థలాలను దక్కించుకునేందుకే..

అమీర్‌పేట లీలానగర్‌లో నవాబ్‌ మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌కు సుమారు 2600 గజాల స్థలం ఉండేది. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కుటుంబ సభ్యులంతా మరణించగా అస్మత్‌ ఉన్నీసాబేగం, మహమ్మదీ ఉన్నీసా బేగం కలిసి ఓ గదిలో ఉంటున్నారు. రూ.కోట్ల విలువైన ఆస్తిని దక్కించుకునేందుకే వీరిని కిడ్నాప్‌ చేసినట్లు తెలిసింది. ఆ స్థలాలపై సివిల్‌ తగాదాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. తమ వద్ద ఉన్న కీలక పత్రాలు, బంగారు నగలను కూడా ఆగంతుకులు లాక్కున్నట్లు బాధితులు తెలిపారు. మిరాజ్‌ అహ్మద్‌ ఖురేషీ, మరో నలుగురిపై పోలీసులు కిడ్నాప్‌, దాడి కేసులను నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని