వేధింపులు పెరిగి.. లైంగిక దాడుల్లో నలిగి!
eenadu telugu news
Updated : 24/09/2021 05:08 IST

వేధింపులు పెరిగి.. లైంగిక దాడుల్లో నలిగి!

పసిమొగ్గలపై పెరుగుతున్న పైశాచికాలు

పరువు పోతుందని బాధితుల మౌనం

ఈనాడు, హైదరాబాద్‌


* హైదరాబాద్‌ శివారులోని ఓ పోలీస్‌ ఠాణా పరిధిలో నివసిస్తున్న బాలిక(16) ఒక దుకాణంలో పనిచేస్తోంది. తండ్రి వయసున్న దుకాణ యజమాని రెండు నెలలుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం లైంగికంగా దాడి చేయబోతే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు రక్షించారు. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్‌ చేశారు.

* రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో తన ఇద్దరు కుమార్తెలతో ఉంటున్న కన్న తండ్రి.. పదమూడేళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దురాగతం ఇరుగుపొరుగు మహిళల ద్వారా పోలీసులకు తెలిసింది. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

* జూబ్లీహిల్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాలిక(9)పై కాపలాదారుడి కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు. లిఫ్ట్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లికి చెప్పడంతో నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

- రాజధానిలో ఒకే రోజు జరిగిన ఘటనలివి


సైదాబాద్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో చిన్నారి(6)పై హత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టించింది. అయినా చిన్నారులు, మైనర్లపై ఆగడాలు ఆగడంలేదు. వావి వరుస చూడకుండా లైంగికంగా వేధిస్తున్నారు. బయటకు చెబితే పరువు పోతుందన్న భావనతో బాధితులు మౌనంగా భరిస్తున్నారు.

అమాయకత్వం, తెలియని భయం...

చిన్నారులు, బాలురు, బాలికల్లో అమాయకత్వం, ఎవరైనా తమ శరీర భాగాలను తాకినా, బెదిరించినా ఏం చేయాలో తెలియని భయంతో ఉంటారు. అమాయకత్వం, చాక్లెట్లు, బిస్కెట్లపై పిల్లలకున్న ఆశను కొందరు కామాంధులు లైంగిక వేధింపులు, దాడులకు ఉపయోగించుకుంటున్నారు. అపరిచితులు, బంధువులతోపాటు ఎవరైనా ఎత్తుకున్నా శరీర భాగాలను తాకినా ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు వారికి వివరించడం లేదు. దీంతోపాటు కౌమార దశలోని బాలికలకు మంచి, చెడూ స్పర్శలు వివరించి చెప్పేందుకు కొందరు తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడో, తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడో కామాంధులు మాటలతో మాయచేసి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారు. మరికొందరు కామాంధులు పిల్లలకు అశ్లీల వీడియోలు, అసభ్య ఫోటోలు చూపించి అలా చేద్దామంటూ లైంగికంగా వేధిస్తున్నారు.

బాధితులు ముందుకు వస్తే...

పిల్లలు, విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న దుర్మార్గులను పోలీసులు చట్టపరంగా శిక్షిస్తున్నా, ఫిర్యాదుకు బాధితులు ఇంకా ముందుకు రావడం లేదు. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న పది మంది బాధితుల్లో నలుగురైదుగురు మాత్రమే తమ వద్దకు వస్తున్నారంటూ ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ లైంగిక వేధింపులు పెరుగుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం వీటిని అరికట్టేందుకు నాలుగు నెలల క్రితం పలు చర్యలు చేపట్టింది. చెన్నైలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అశ్లీలంగా మాట్లాడ్డం, వీడియోలు పంపించడంతో ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఇలాంటి నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలంటూ ఆదేశించారు.


కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

అమీర్‌పేట, న్యూస్‌టుడే: కన్న కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎస్సార్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాలివీ.. ఓ కాలనీలో నివసించే బాలిక(17) ఇటీవల ఇంటర్మీడియట్‌ పూర్తి కావడంతో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది. కారు డ్రైవర్‌గా పనిచేసే తండ్రి కొంతకాలంగా కూతురితో అసభ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. గురువారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. భయపడిన బాలిక బయటకు పరుగెత్తి పక్కింటి మహిళకు విషయం చెప్పింది. స్థానికులందరికీ తెలియడంతో నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని