ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2కు పచ్చజెండా!
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2కు పచ్చజెండా!

తాగునీటి సరఫరా పనులు ఇక చకచకా

ఈనాడు, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో శివార్ల కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు సమృద్ధిగా తాగునీరు అందనుంది. ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 ప్రాజెక్టులో భాగంగా తాగునీటి పైపులైన్ల విస్తరణ, కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి అనుమతులిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో ఇక చకచకా పనులు ప్రారంభం కానున్నాయి. వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ పనులకు సంబంధించి ఈ ఏడాది జులైలో జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జీవో విడుదల చేయడంతో అవుటర్‌ రింగ్‌ చుట్టూ పుష్కలంగా తాగు నీటి సరఫరాకు మార్గం సుగమం అయింది. ఇందులో భాగంగా 12 మండలాల్లో రూ.1200 కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు. 137 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్లు, దాదాపు 2093 కిలోమీటర్ల మేర కొత్త సరఫరా వ్యవస్థను విస్తరించనున్నారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ ఉన్న 197 గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి రూ.756 కోట్లతో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-1 ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. 164 రిజర్వాయర్లు, 2 వేల కిలోమీటర్ల మేర పైపులైన్‌ పనులు పూర్తి చేశారు. తద్వారా 1300 కాలనీలు, బస్తీల్లోని దాదాపు 10 లక్షల మందికి శుద్ధి చేసిన జలాలు అందిస్తున్నారు. పెరుగుతున్న తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫేజ్‌-2 ప్రాజెక్టును చేపట్టనున్నారు.

కొత్త ప్రాంతాలకు సమస్య లేకుండా...

ఓఆర్‌ఆర్‌ నిర్మాణంతో హైదరాబాద్‌ నగరంతోపాటు శివార్ల రూపురేఖలే మారిపోతున్నాయి. ఇప్పటికే అవుటర్‌కు అటు ఇటు ఏడు కార్పొరేషన్లు, 29 వరకు మున్సిపాలిటీలు ఉన్నాయి. స్థిరాస్తి రంగం ఊపందుకోవడంతో ఆయా ప్రాంతాల చుట్టూ కొత్త కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు పుట్టుకొస్తున్నాయి. మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కొత్త వెంచర్లకు అనుమతి ఇస్తోంది. దీంతో విల్లాలు, కాలనీలు నిర్మిస్తున్నారు. అవుటర్‌ చుట్టు పక్కల ప్రభుత్వం పేదల కోసం రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తోంది. కొల్లూరులో 16500, రాంపల్లిలో 5 వేల గృహాలు నిర్మించారు. కొల్లూరుకు ఇప్పటికే తాగునీటి పైపులైన్లు నిర్మిస్తున్నారు. 2036 నాటికి ఇంకా కొత్త కాలనీలు, కమ్యూనిటీలు రానున్నాయి. ప్రస్తుతం వీటికి తాగునీటి సరఫరా అనేది పెద్ద సవాలుతో కూడుకున్న వ్యవహారమే. కృష్ణా మూడు ఫేజ్‌లు, గోదావరి, మంజీరా ద్వారా నిత్యం 460 మిలియన్‌ గ్యాలన్ల వరకు తాగునీటిని జలమండలి సరఫరా చేస్తోంది. పెరుగుతున్న అవసరాలకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇప్పటికీ శివార్లలో మూడు రోజులకొకసారి తాగునీటిని అందిస్తున్నారు. కొత్తగా విస్తరించే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటిని అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెరుగైన సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా తాజా ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. త్వరలో ఓఆర్‌ఆర్‌ చుట్టూ భారీ పైపులతో రింగ్‌ మెయిన్‌ ఏర్పాటు చేయనున్నారు. దీనిని కాళేశ్వరం ప్రాజెక్టుతోనూ అనుసంధానించాలనేది యోచన. దీంతో నగర అవసరాలకు ఎటువైపు నుంచైనా తాగునీటిని తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శివార్లు విస్తరిస్తే ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని