మందుగోలీ.. ఖాళీ!
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

మందుగోలీ.. ఖాళీ!

గాంధీ, ఈఎన్‌టీల చుట్టూ బ్లాక్‌ఫంగస్‌ రోగుల ప్రదక్షిణలు

స్టాకు లేదని తిప్పి పంపుతున్న వైనం

రెండు నెలల క్రితం 60 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకింది. కోలుకున్న తర్వాత మ్యూకార్‌ మైకోసిస్‌ దాడి చేసింది. ఉస్మానియాలో వైద్యులు పరిశీలించి బ్లాక్‌ఫంగస్‌గా గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. ఇటీవలే ఆమెకు సర్జరీ కూడా చేశారు. అనంతరం మూడు నెలలపాటు యాంటీ ఫంగస్‌ మందులు వాడాలి. ఔషధాల కోసం ఈఎన్‌టీ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత మందుల కొరత ఉందని, బయట కొనుగోలు చేసుకోవాలని చెప్పారని ఆమె వాపోయారు. బయట ఔషధాలు కొనాలంటే రోజుకు రూ.వేయి వరకు ఖర్చు కానుండటంతో అంత వ్యయం భరించలేక లబోదిబోమంటున్నారు. పైగా బహిరంగ మార్కెట్‌లో కూడా బ్లాక్‌ఫంగస్‌ మందులు లభించడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

ఈ ఒక్కరే కాదు...చాలామంది రోగులది ఇదే పరిస్థితి. బ్లాక్‌ఫంగస్‌(మ్యూకార్‌ మైకోసిస్‌) రోగులకు చుక్కలు కన్పిస్తున్నాయి. ఔషధాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఈఎన్‌టీ ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం వందల సంఖ్యలో బాధితులు ఈ రెండు ఆసుపత్రులకు వచ్చి నిరీక్షిస్తున్నారు. అయినా సరే స్టాకు రాలేదని తిప్పిపంపుతున్నారు. ఈ వ్యాధి సోకి ఆసుపత్రిలో చేరిన వారికి లైపోసోమల్‌, యాంఫోటెరిసిన్‌-బి లాంటి యాంటీ ఫంగస్‌ ఇంజెక్షన్లు అందిస్తారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక మూడు నెలల వరకు పొసకొనజోల్‌ అనే మందుగోలీలు వాడాలి. ఒక్కో మాత్ర రూ.350 వరకు ఉంటుంది. రోజుకు రెండు చొప్పున తీసుకోవాలి. బయట కొనాలంటే మూడు నెలలకు రూ.70 వేల వరకు ఖర్చు అవుతుంది. పేద రోగులకు భారమని భావించి ఈఎన్‌టీ, గాంధీ ఆసుపత్రుల నుంచి ప్రతి 15 రోజులకు సరిపడ మందులను ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా ఔషధాలకు తీవ్ర కొరత నెలకొంది. 15 రోజులకు ఇచ్చిన గోలీలు అయిపోవడంతో చాలామంది రోగులు ఈఎన్‌టీ, గాంధీ ఆసుపత్రులకు వస్తున్నారు. తీరా మందులు లేవని సిబ్బంది చెబుతుండటంతో ఉసూరుమంటూ తిరిగెళ్తున్నారు. బయట కొనుగోలు చేద్దామన్నా.. అక్కడా లభించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాప్యం చేస్తే.. ముప్ఫే. బ్లాక్‌ఫంగస్‌ సోకిన ప్రతి ఒక్కరు కనీసం మూడు నెలలపాటు తప్పకుండా మందులు వాడాలి. కొందరికి ఇంకా ఎక్కువ రోజులే పడుతుంది. మందులు మధ్యలో మానివేసినా...తీసుకోవడంలో జాప్యం చేసినా...మళ్లీ ఫంగస్‌ ముప్పు పొంచి ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు మెదడుపై దాడిచేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఫంగస్‌ తగ్గినా సరే...వైద్యుల సూచనలతో మందులను నిలుపుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలామంది 10-15 రోజుల నుంచి మందులు తీసుకోవడం లేదు. కొరత కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.

మందుల కొరత నిజమే...

బ్లాక్‌ఫంగస్‌ నుంచి ఇప్పటికే కోలుకొని మందులు వాడుతున్న వారికి కొన్ని రోజులుగా ఔషధాల సరఫరా నిలిచిపోయిందని గాంధీకి చెందిన ఓ వైద్యుడు తెలిపారు. ప్రస్తుతం గాంధీతోపాటు ఈఎన్‌టీలో స్టాకు లేదని చెప్పారు. మందుల కోసం వైద్యఆరోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఎప్పుడు స్టాకు వస్తుందో చెప్పలేమన్నారు. అయితే ఇన్‌పేషెంట్లుగా ఉన్న రోగులకు మాత్రం మందులు అందిస్తున్నామన్నారు. వీరికి లైపోసోమల్‌, యాంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే డిశ్చార్జి అయిన రోగులకు ప్రతి 15 రోజులకు సరఫరా చేయాల్సిన పొసకొనజోల్‌ ఔషధాలు స్టాకు లేకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నామని, మందులు వచ్చిన తర్వాత అందరికి సరఫరా చేస్తామని వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని