విజృంభించిన బాలాజి.. విల్లోమెన్‌ జట్టు విజయం
eenadu telugu news
Published : 24/09/2021 02:44 IST

విజృంభించిన బాలాజి.. విల్లోమెన్‌ జట్టు విజయం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: విజయ్‌పురి విల్లోమెన్‌ బౌలర్‌ బాలాజి (7/60) ఏడు వికెట్లతో అదరగొట్టాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఏ2 డివిజన్‌ రెండు రోజుల లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బాలాజి మెరవడంతో అభినవ్‌ సీసీపై విజయ్‌పురి విల్లోమెన్‌ 17 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన విల్లోమెన్‌ 41 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో హరీష్‌ రెడ్డి (4/43) ఆకట్టుకున్నాడు. ఛేదనలో బాలాజి ధాటికి అభినవ్‌ సీసీ 130 పరుగులకే పరిమితమైంది. హెచ్‌యూసీసీతో మ్యాచ్‌లో ఛీర్‌ఫుల్‌ చమ్స్‌ ఆటగాడు అక్షత్‌ (118) శతకంతో సత్తాచాటాడు.మొదట బ్యాటింగ్‌ చేసిన ఛీర్‌ఫుల్‌ చమ్స్‌ 90 ఓవర్లలో 7 వికెట్లకు 396 పరుగులు చేసింది. హెచ్‌యూసీసీ బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. మరో మ్యాచ్‌లో మహమ్మద్‌ హరుణ్‌ (5/9) విజృంభించడంతో ఎలిగంట్‌ సీసీపై ఎనిమిది వికెట్ల తేడాతో హైదరాబాద్‌ బ్లూస్‌ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఎలిగంట్‌ సీసీ 23.3 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్‌తో పాటు అభిషేక్‌ (3/11) కూడా బంతితో మెరిసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ బ్లూస్‌ 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని